Wednesday, December 14, 2011

లోక్‌పాల్ బిల్లుపై పార్టీల మధ్య కుదరని ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ,డిసెంబర్ 15:  లోక్‌పాల్ బిల్లుపై ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేలోగానే ఈ బిల్లు ఆమోదించేలా పార్టీలన్నీ సహకరించాలని, పార్టీ రాజకీయాలకు దీనిని బలి చేయవద్దని ప్రధాని విజ్ఞప్తి చేసినా, ఫలితం లేకుండా పోయింది. ప్రధానిని, దిగువ శ్రేణి ప్రభుత్వోద్యోగులను లోక్‌పాల్ పరిధిలోకి తేవడం వంటి కీలక అంశాలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.  దాదాపు మూడు గంటల సేపు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గ్రూప్-సీ, గ్రూప్-డీ ఉద్యోగులను లోక్‌పాల్ పరిధిలోకి చేర్చాల్సిందేనని బీజేపీ పట్టుపట్టగా, సీపీఐ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి చేర్చాలన్న అంశంపై మాత్రం బీజేపీ, వామపక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. గ్రూప్-సీ, గ్రూప్-డీ ఉద్యోగులు కోట్ల సంఖ్యలో ఉన్నందున వారందరినీ లోక్‌పాల్ పరిధిలోకి చేర్చడం సాధ్యంకాని పని అని తమ పార్టీ భావిస్తోందని సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా అన్నారు. వారి కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. లోక్‌పాల్ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలని వామపక్షాలు డిమాండు చేశాయి. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తితోనే కొనసాగాలని, అయితే, సీబీఐ డెరైక్టర్ ఎంపికలో లోక్‌పాల్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని శిరోమణి అకాలీదళ్ నేత ఎస్.ఎస్.ధిండ్సా అన్నారు. లోక్‌పాల్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండు కూడా అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమైంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...