Tuesday, December 27, 2011

ఇండియా కోసం మరణిస్తా:అన్నా హజారే

ముంబైలో మూడు రోజుల నిరాహార దీక్ష ప్రారంభం  ముంబై,డిసెంబర్ 27: భారత ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని, తాను జీవించి ఇండియా కోసం మరణిస్తానని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లు బలహీనంగా ఉందని ఆరోపిస్తూ , ఇక్కడి ఎంఎంఆర్‌డిఎ మైదానంలో మూడు రోజుల నిరాహార దీక్ష ప్రారంభించిన అన్నా హజారే భారీగా గుమికూడిన ప్రజలను ఉద్దేశించి  ప్రసంగించారు. గుండె నిచ్చిన భారత దేశం కోసం ప్రాణాలనైనా అర్పిస్తానని ఆయన అన్నారు. దేశం కోసం తాను కుటుంబాన్నే వదిలేశానని, తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా తెలియదని, దేశం కోసం వివాహం కూడా చేసుకోలేదని ఆయన అన్నారు. మరణిస్తాననే భయం లేదని, పోరాడుతూ పోతానని ఆయన అన్నారు. తన జట్టు సభ్యులు దీక్ష విరమించాలని అడిగారని, తాను వారి మాటలు వినలేదని ఆయన చెప్పారు.ప్రజల మద్దతు వల్లనే రామ్ లీలా మైదాన్‌లో 12 రోజులు దీక్ష చేయగలిగానని ఆయన చెప్పారు. లోక్‌పాల్ బిల్లును నీరు గార్చడం అన్నా జట్టును మోసం చేయడం కాదని, ప్రజలను మోసం చేయడమని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఏదో ఒక రోజు ప్రజలు ఎగిసిపడి ప్రభుత్వాన్ని శిక్షిస్తారని ఆయన అన్నారు. ప్రజా పార్లమెంటు ఢిల్లీలోని పార్లమెంటు కన్నా పెద్దదని ఆయన అన్నారు. తమ ఓట్ల ద్వారా ప్రజలు ప్రభుత్వాన్ని శిక్షిస్తారని ఆయన అన్నారు. తన శరీర ఉష్ణోగ్రతపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అయినా దీక్ష కొనసాగిస్తానని ఆయన అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...