Sunday, December 11, 2011

మల్లెమాల వెళ్ళిపోయారు...

హైదరాబాద్, డిసెంబర్ 11:  సందేశాత్మక  కవితలతో...సినిమాలతో...  సహజకవి గా, నిర్మాతగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించిన ఎం.ఎస్.రెడ్డి (మల్లెమాల సుందరరామిరెడ్డి) ఆదివారం  హైదరాబాద్‌లో మరణించారు.   ఆయన వయసు 87ఏళ్లు.   నిర్మాతగా ఆయన తొలి సినిమా ‘భార్య’. ఇది తమిళ చిత్రం ‘భవాని’కి రీమేక్. కౌముది పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి కేఎస్‌ప్రకాశరావు దర్శకత్వంలో ఆయన ఆ సినిమాను నిర్మించారు.  ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణవిజయం’ ఆయన సంస్థకు గుర్తింపు తెచ్చిన సినిమా. అందులో ప్రఖ్యాత నటి హేమమాలిని చేత ఓ ప్రత్యేక పాటలో నర్తింపచేశారాయన. తర్వాత చలంతో  'ఊరికి ఉపకారి, , శోభన్‌బాబుతో కోడెనాగు, నాయుడుబావ, జీవితనౌక, రామబాణం, కృష్ణతో పల్నాటిసింహం, ఏకలవ్య, సుమన్‌తో ‘కళ్యాణవీణ’, నారాయణరావుతో ‘ముత్యాలపల్లకి’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘రామాయణం’ తదితర చిత్రాలను కౌముది, శబ్దాలయ, గహత్రి ఫిలింస్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ సంస్థలపై నిర్మించారు ఎమ్మెస్. జూనియర్ ఎన్టీఆర్‌ని ఆయన హీరోగా పరిచయంగా చేస్తూ... అందరూ బాలలతో గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన ‘రామాయణం’ విమర్శకుల ప్రశంసలందుకుంది. అలాగే భాగస్వామిగా దొరలు-దొంగలు, రామయతండ్రి, వంశోద్ధారకుడు, వెలుగునీడలు చిత్రాలను ఆయన నిర్మించారు. అలాగే శాంతి పిక్చర్స్ ద్వారా ‘శంకరాభరణం’ చిత్రాన్ని పంపిణీ చేసి డిస్ట్రిబ్యూటర్‌గా కూడా తనదైన ముద్ర వేశారు రెడ్డి. తుపాన్ బీభత్సంపై ఆయన నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రం ‘కన్నీటి కెరటాలు’ విమర్శకుల ప్రశంసలందుకుంది. తన తనయుడు ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మాతగా మారాక.. ఆయన నిర్మించిన తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, అమ్మోరు, అరుంధతి లాంటి సంచలన హిట్ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు.  తన ఇంటిపేరునే కలం పేరుగా చేసుకొని ‘మల్లెమాల’ పేరిట ఎన్నో రచనలు చేశారు ఎమ్మెస్. ‘ముత్యాలపల్లకి’లో ‘‘సన్నాజాజికి గున్నమావికి పెళ్లి కుదిరింది’’, ‘‘తెల్లావారకముందే పల్లె లేచింది’’ పాటలు పెద్ద హిట్ సాంగ్స్‌గా నిలిచాయి. ‘తలంబ్రాలు’లో ‘‘బుల్లిపాప కోరేది తల్లిపాలు, కన్నెపిల్ల కోరేది తలంబ్రాలు’’ పాట కూడా పెద్ద హిట్. ఇంకా పల్నాటిసింహం, పచ్చని సంసారం, అంకుశం, అమ్మోరు చిత్రాలకు ఆయన పాటలు రాశారు. అలాగే ఆయన రాసిన ‘మల్లెమాల రామాయణం’ పుస్తకం పాఠకుల నుంచి విశేషఆదరణ పొందింది. ఇటీవల ఆయన రచించిన ‘ఇది నా ఆత్మ కథ’ పుస్తకం విడుదల కాకుండానే సంచలనం సృష్టించింది.
నిర్మాతగా ఎన్ని గొప్ప సినిమాలను నిర్మించినా... చాలామందికి ఎమ్మెస్‌రెడ్డి అనగానే గుర్తొచ్చేది ‘అంకుశం’లో ఆయన పోషించిన ముఖ్యమంత్రి పాత్ర. ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర నిలిచేవుంది. చలనచిత్ర వాణిజ్యమండలికి అధ్యక్షుడిగా వ్యవహరించడంతో పాటు, రెండు సార్లు చలనచిత్ర అభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఫిలింనగర్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కూడా అధ్యక్షుడుగా సేవలందించారు. అన్నామలై యూనివర్సిటీనీ నుంచి డాక్టరేట్, రాష్ట్ర ప్రభుత్వం అందించే రఘుపతి వెంకయ్య పురస్కారం, అలాగే ‘రామాయణం’ చిత్రానికి గాను నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతులమీదుగా స్వర్ణకమలం అందుకున్నారు. ఇంకా సహజకవి, అభినవ, వేమన, పద్యకవి సమ్రాట్, ఆంధ్రవాల్మీకి, కళారత్న ఆయన అందుకున్న బిరుదులు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...