Tuesday, July 8, 2014

.1,64,374 కోట్లతో రైల్ బడ్జెట్‌...భద్రత, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ...ఇంధనం ధరలు పెరిగినప్పుడు టిక్కెట్ల ధరలుపెంచే యోచన...

న్యూఢిల్లీ, జూలై 8: 2014-15 వ సంవత్సరానికి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ రూ.1,64,374 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక పై  రైల్వే స్టేషన్‌లలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు వేగం పెంచుతారు.  బుల్లెట్ ట్రైన్  త్వరలోనే పరుగులు తీయబోతోంది. రైళ్లలోనూ, ముఖ్యమైన రైలు స్టేషన్‌లలోనూ  పనిచేసుకోవడానికి వీలుగా త్వరలోనే వైఫై రాబోతోంది. రైల్వేల అభివృద్ధి ఇక మీదట ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో జరగబోతోంది. మహిళా ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించడానికి వీలుగా మహిళలకు రిజర్వ్ చేసిన రైలు బోగీలలో వేల సంఖ్యలో మహిళా పోలీసులను నియమించబోతున్నారు. అన్నిటికంటె మించి రైళ్లలోనూ, రైలు స్టేషన్‌లలోనూ పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలోనూ ఎస్కలేటర్లు ఏర్పాటుకాబోతున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. రైలు బయలుదేరడానికి ముందే ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకుపోవడం, రైలు స్టేషన్‌లోకి వచ్చాకే ఆటోమేటిక్ తలుపులు తెరుచుకోవడం, వచ్చే స్టేషన్‌లో ప్రయాణికులు తమకు ఏయే ఆహార పదార్ధాలు కావాలో మొబైల్ ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించబోతున్నారు. మెట్రో నగరాలను కలుపుతూ హై స్పీడ్ రైళ్లను త్వరలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇంధనం ధరలు పెరిగినప్పుడు టిక్కెట్ల ధరలు పెరుగుతాయని కూడా మంత్రి చెప్పడం కొసమెరుపు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రైళ్లు
నాగపూర్ - సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు,  చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు, సికింద్రాబాద్ - నిజాముద్దీన్ ప్రీమియం రైలు, విశాఖ - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు, పారాదీప్ - విశాఖల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు,  విజయవాడ - ఢిల్లీ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు,  సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని  రైల్వే మంత్రి  తెలిపారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, రూ. 20 వేల కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సదానందగౌడ తెలిపారు. రైల్వే రిజర్వేషన్లలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆయన చెప్పారు. మొబైల్స్, పోస్టాఫీసుల ద్వారా టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించునున్నట్లు ఆయన తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...