Friday, July 11, 2014

పోలవరం బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఆమోదం...

న్యూఢిల్లీ, జులై 11 : ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్టు సక్రమంగా పూర్తి కావడం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో చేసిన ఏడు మండలాలను ఏపీకి కేటాయిస్తూ పోలవరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.  బిల్లును ప్రవేశపెట్టడాన్ని టీఆర్ఎస్, బీజేడీ, ఒడిషా ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్టు కోసం వందలాది గ్రామాలను ముంపునకు గురిచేస్తూ, సరిహద్దు మార్చి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ చేసిన ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం అయితే సంబంధిత రాష్ట్ర అభిప్రాయాలను రాష్ట్రపతి తీసుకుని ఆ తర్వాత లోక్‌సభలో ప్రవేశపెట్టాలని, అధికారంలో ఉన్నామంటూ ఆర్టికల్ 3ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్టాచుటరీ రిసెల్యూషన్‌ను సభలో ప్రవేశపెట్టారు. అయితే వినోద్ ప్రవేశపెట్టిన తీర్మానం సభలో వీగిపోయింది. ఈ నేపథ్యంలో బీజేడీ ఎంపీ రాయ్, టీఆర్ఎస్ ఎంపీ వినోద్ లేవనెత్తిన అంశాలను తోసిపుచ్చుతూ పోలవరం బిల్లును పాస్ చేయాలంటూ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశించారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన తీర్మానానికి లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని, ముంపు ప్రాంతాల ప్రజలకు పురరావాసం కల్పించేందుకే 7 మండలాలను ఏపీలో కలుపుతున్నామని  రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 1959 వరకు భద్రాచలం డివిజన్ ఏపీలోనే ఉందని ఆయన గుర్తు చేశారు. అందులో నుంచి కొన్ని మండలాలనే ఆంధప్రదేశ్‌లో కలుపుతున్నట్లు రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
కేంద్రం వైఖరి అప్రజాస్వామికం : కేసీఆర్
హైదరాబాద్ : పోలవరంపై కేంద్రం వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్రంగా వ్యతిరేకించారు.  పార్లమెంట్‌లో పోలవరం బిల్లు ఆమోదం పొందడంతో కేసీఆర్ అందుబాటులో ఉన్న ఇరిగేషన్ అధికారితో సహా పలువురు ఉన్నతాధికారులతో  చర్చలు జరిపారు. కేంద్రం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందని, బిల్లు ఆమోదం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, సుప్రీం కోర్టుకు వెళతామని సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...