Thursday, April 11, 2013

ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్న అమితాబ్

హైదరాబాద్, ఏప్రిల్ 11: బిగ్ బి అమితాబ్ బచ్చన్ 2011 వ సంవత్సరానికి ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు. లలిత కళా తోరణంలో గురువారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి అమితాబ్ స్వయంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ అవార్డును అమితాబ్‌కు అందజేశారు. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అని తెలుగులో శుభాకాంక్షలు అందిస్తూ అమితాబ్ తమ సంతోషాన్ని తెలియజేశారు. ఎన్టీఆర్ పేర నెలకొల్పిన జాతీయ అవార్డు లభించడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు, ఎన్టీఆర్ ఎంతో గొప్ప వ్యక్తి అని శ్లాఘిస్తూ ఆయన బ్రతికి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవారమని ఆయన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. సినిమా అనేది దేశం మొత్తాన్ని ఏకం చేయగలిగినంత శక్తిమంతమైనదంటూ దేశంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవాళ్లమంతా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా జోక్ వస్తే ఒకే రకంగా నవ్వుతామని, అలాగే హృదయాన్ని కదిలించే దృశ్యాలు వచ్చినప్పుడు అదే విధంగా కన్నీరు కారుస్తామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ అవార్డు ఇచ్చిన తెలుగువారికి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటానని ఆయన సినిమా అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు. కాగా, రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును కైకాల సత్యనారాయణకు ప్రదానం చేశారు.2011 సంవత్సరం  నంది అవార్డులను కూడా ప్రదానం చేశారు.  ఉత్తమ చిత్రంగా ఎంపికైన శ్రీరామరాజ్యం చిత్రానికి నిర్మాత యలమంచిలి సాయిబాబా అవార్డును అందుకోగా, ఉత్తమ నటుడి అవార్డును మహేశ్ బాబు, ఉత్తమ నటి అవార్డును నయనతార  అందుకున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...