తమ్ముళ్ళు టి.డి.పి. లోకి పోరు: చిరు
రాజమండ్రి, ఫిబ్రవరి 25: తన సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి స్పష్టం చేశారు. వారు టిడిపిలోకి వెళ్ళే ప్రసక్తి లేదని చిరు రాజమండ్రిలో చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ఎలాంటి గ్రూపు విభేదాలు లేవన్నారు. గ్రూపులు ఉన్నాయనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. కాంగ్రెసులో తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం ద్వారా తనకు మంచి వేదిక దొరికిందన్నారు. విలీనానంతరం రాజకీయంగా తన బలం మరింత పెరిగిందని అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అంశంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకే తాను పని చేస్తానని చెప్పారు. పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు.

Comments