Wednesday, February 22, 2012

నల్లారి పాలనపై ' చంద్ర ' నిప్పులు

హైదరాబాద్,ఫిబ్రవరి 22:  ఇది పనికిమాలిన ప్రభుత్వం అని బుధవారం  శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  సుదీర్ఘంగా చేసిన  ప్రసంగంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధులలో తాకట్టు పెడుతున్నారని, అందువల్ల తాము గవర్నర్ ప్రసంగాన్ని సమర్ధించలేకపోతున్నామని చంద్రబాబు  అన్నారు.  అసమర్థ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అవినీతి మంత్రులు ఎందుకు రాజీనామా చేయరని ఆయన ప్రశ్నించారు. మద్యం సిండికేట్ లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినా మంత్రి రాజీనామా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.
ఈ ప్రభుత్వం అవినీతిని నియంత్రించలేకపోతోందన్నారు. 4700 కోట్ల రూపాయల విలువైన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని అర్హతలేని కంపెనీకి ఇచ్చి, ఆ తరువాత రద్దు చేశారన్నారు. మంత్రుల మాటలు విన్న అధికారులు జైళ్లలో ఉన్నారన్నారు. ప్రభుత్వ అవినీతి వల్ల ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడకు రావడంలేదని , రాజీవ్ గృహ కల్పపేరుతో డబ్బు వసూలు చేసి ఇళ్లు కట్టించలేదని విమర్శించారు. శాంతి భద్రతలు పరిస్థితి అధ్వాన్నంగా తయారయిందన్నారు. ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు జాతీయహొదా కల్పించలేకపోవడం ప్రభుత్వం చేతగానితనంగా పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందన్నారు. రాష్ట్రంపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేని హీనస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రజలు పన్నుపోటుతో చితికి పోతున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావటం ఖాయమన్నారు.  తెలంగాణపై తమ వైఖరిని ఇది వరకే చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, తెలంగాణపై నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని అనిశ్చితికి తెర దించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. తమను అడ్డం పెట్టుకుని కాంగ్రెసు రాజకీయాలు చేస్తోందని, తమ పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని, తమ పార్టీని ఎవరూ దెబ్బ తీయలేరని ఆయన అన్నారు. ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...