Thursday, February 2, 2012

74 మంది ప్రాణాలను బలిగొన్న ఫుట్‌బాల్ మ్యాచ్

కైరో,ఫిబ్రవరి 2:  ఈజిప్టులోని పోర్ట్ సయీద్‌లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్.. మృత్యు క్రీడగా మారింది. 74 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనలో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం పోర్ట్ సయీద్ పట్టణంలో అగ్రశ్రేణి సాకర్ క్లబ్‌లు అల్ మస్త్రీ, అల్ అహ్లీల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఇరు జట్ల అభిమానుల మధ్య దూషణల పర్వం కొనసాగింది. అల్ అహ్లీ మద్దతుదారుడు ఒకరు స్థానిక జట్టు అల్ మస్త్రీని అవమానిస్తూ బ్యానర్‌ను ప్రదర్శించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ మ్యాచ్‌లో స్థానిక జట్టు అల్ మస్త్రీ, అల్ అహ్లీ(కైరో జట్టు)ను 3-1 తేడాతో ఓడించింది. దీనితో  మ్యాచ్ ముగియగానే వందలాది మంది అల్ మస్త్రీ జట్టు మద్దతుదారులు మైదానంలోకి దూసుకెళ్లారు.  ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వేలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, తలుపులు మూసేసి ఉండటంతో బయటకు వెళ్లే దారి లేకుండా పోయింది. అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లే దారి వైపు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. చనిపోయినవారిలో ఎక్కువ మంది తొక్కిసలాటలోనే మరణించారు. కొందరు నేరుగా బాల్కనీల నుంచి పిచ్ మీదకు దూక డంతో మృతి చెందారు.  ఈ ఘటనకు సంబంధించి 47 మందిని అరెస్టు చేశామని రక్షణ శాఖ పేర్కొంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...