మంత్రి మోపిదేవికి డబ్బులిచ్చినట్లు ఎసిబి బలవంతంగా చెప్పించింది...

మాట మార్చిన మద్యం వ్యాపారి  రమణ
హైదరాబాద్ ఫిబ్రవరి 29:   మద్యం సిండికేట్ల వ్యవహారంలో మద్యం వ్యాపారి నున్నా రమణ ఫ్లేటు ఫిరాయించాడు. ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఇంతకు ముందు చెప్పిన అతను ఇప్పుడు పూర్తిగా మాట మార్చాడు. మోపిదేవి వెంకటరమణ పేరును ఎసిబి అధికారులు తనతో బలవంతంగా చెప్పించారని అతను ఆరోపించాడు. రెండోసారి కోర్టులో అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటిషన్‌లో అతను సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై ఎసిబి థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని  ఆరోపించాడు. తనకు మద్యం సిండికేట్లతో సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, తన పిల్లల చదువుల కోసం, తన భార్య ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మాత్రమే తాను ఖమ్మంలో ఉంటున్నానని అతను చెప్పాడు. ఎసిబి అధికారులు పెట్టిన బాధలు తాను భరించలేకపోయానని, ఎసిబి అధికారులు తనను అనవసరంగా ఇరికించారని అతను చెప్పాడు. తనపై ఒత్తిడి తెచ్చి ఎసిబి అధికారులు  తన వాంగ్మూలాన్ని వారిష్టం వచ్చినట్లు రాసుకున్నారని ఆరోపించాడు. తనకు ఏ సంబంధం లేని విషయాలు అధికారులు చేర్చారని అతను చెప్పాడు. ఎసిబి అధికారులు తనతో తప్పుడు ప్రకటనలు చేయించారని అన్నాడు. ప్రస్తుతం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో రమణ అధికారులకు, ఇతరులకు ముడుపులు ఇచ్చిన విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. ఓ సీనియర్ న్యాయవాది రమణ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రమణ బెయిల్ పిటిషన్‌పై  ఎసిబి  కౌంటర్ దాఖలు చేసింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు