Friday, February 24, 2012

శాసనసభ లో మద్యం కంపు !

హైదరాబాద్ ఫిబ్రవరి 24:   రాష్ట్ర శాసనసభ శుక్రవారం మద్యం కంపు కొట్టింది. మద్యం సిండికేట్లపై రాత్రి 9.20 వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష  తెలుగుదేశం పార్టీల నేతలు  తాగుబోతుల కన్న హీనంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు. మద్యం ముడుపుల ఆరోపణలపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ సందర్భంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సిగ్గు శరం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దర్యాఫ్తును ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. ఆరోపణలు వచ్చిన వారిని సిఎం వెనకేసుకొస్తున్నారన్నారు. తనను ముఖ్యమంత్రి నిందితుడు అంటున్నారని అయితే అరెస్టు చేసుకోండని సవాల్ విసిరారు. సిఎం కిరణ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా దిగజారారన్నారు. నేను సిఎంలా నా తమ్ముళ్లతో వసూళ్లు చేయించడం లేదన్నారు. మోపిదేవికి సిఎం క్లీన్ చిట్ ఎలా ఇస్తారన్నారు. కాంగ్రెసు నుండి నీతి సూత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఏ సిఎం ఇంత నీచంగా మాట్లాడలేదన్నారు. సిఎం దోషులను సమర్థిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని తాము ఎవరినీ వదలే సమస్య లేదన్నారు. ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి లేరన్నారు. తన రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీలతో పని చేశానన్నారు. అంతర్గత విభేదాలలో కూరుకుపోయి కిరణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. బాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదే స్థాయిలో మండిపడ్డారు. సిగ్గు, శరం బాబు దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని, ఆయన  చరిత్ర టిడిపి ఆఫీసులో చెప్పుకోవాలని   ఎద్దేవా చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు బాబు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు.  చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. లిక్కర్ కేసులో నిందితుడు అయి ఉండి చంద్రబాబు సిగ్గు లేకుండా కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటల్లా ఉన్నాయా అన్నారు. బాబులా సభలో ఇప్పటి వరకు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు. సిగ్గు, లజ్జ లేనిది వారికేనని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వంటి ప్రతిపక్ష నేత దాపురించడం  ఖర్మ అన్నారు. బాబు మాటలు సభా గౌరవాన్ని కాపాడేలా లేవన్నారు. బాబుకు నైతికత లేదన్నారు. తాను గాలి ముద్దుకృష్ణమలా దిగజారి మాట్లాడలేనన్నారు. బాబు చేసేది నిరసనా ప్రసంగమా అని అడిగారు.  బాబు  విశాల హృదయాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావే తట్టుకోలేక పోయారన్నారు. కాగా సభలో కాంగ్రెసు, టిడిపిల వైఖరికి నిరసనగా బిజెపి, ఎంఐఎం వాకౌట్ చేశాయి. అధికార, ప్రతిపక్షాల తీరును అక్బరుద్దీన్ తప్పు పట్టారు. దీంతో సిఎం, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఇంత చర్చ జరిగినా... మంత్రి మోపిదేవి రాజినామా డిమాండ్ కు గాని, న్యాయ విచారణ డిమాండ్ కు గాని, ఎ.సి.బి. దర్యాప్తు నివేదికను సభ ముందుంచాలన్న డిమాండ్ కు గాని ప్రభుత్వం అంగీకరిచలేదు. పెద్ద ఎత్తున సభా సమయం, ప్రజాధనం వృధా అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...