Thursday, February 16, 2012

బాబుకు రిలీఫ్... వైఎస్ విజయ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్, ఫిబ్రవరి 16 : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, 'ఈనాడు' రామోజీరావు తదితరులపై దర్యాప్తు జరపాలంటూ జగన్ తల్లి వైఎస్ విజయ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వైఎస్ విజయ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించలేమని స్పష్టం చేసింది. ఇందులో రాజకీయ కక్ష సాధింపు ధోరణే కనిపిస్తోందని జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. మొత్తం 55 పేజీల తీర్పులో . 'వైఎస్ విజయ వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనం లేదని పేర్కొంది.  చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని గత ఏడాది అక్టోబర్ 17న వైఎస్ విజయ హైకోర్టులో 'పిల్' వేశారు. ఇందులో చంద్రబాబుతోపాటు నారా భువనేశ్వరి. నారా లోకేశ్, 'ఈనాడు' రామోజీరావు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్, అహోబలరావు, వి. నాగార్జున నాయుడు, ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి, మధుకాన్ షుగర్స్, మాగంటి రాజాబాబు (మురళీ మోహన్), కర్నాటి వెంకటేశ్వరరావు, సీఎం రమేశ్‌లపైనా ఆరోపణలు చేశారు. పిటిషన్‌తోపాటు 2400కు పైగా అనుబంధపత్రాలను సమర్పించారు.
విలువలతో బతుకుతున్నా : బాబు
హైకోర్ట్ తీర్పు పై చంద్రబాబు స్పందిస్తూ, ' 'నా జీవితం తెరిచిన పుస్తకం. 33 ఏళ్ళుగా నేను నా క్యారెక్టర్‌ను, విలువలను కాపాడుకుంటూ వస్తున్నాను. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఇప్పటివరకు నాపై 35 కేసులు వేశారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక 25 రకాల విచారణలు జరిపించారు. అయినా ఒక్క మచ్చ పడకుండా బయటకు రాగలిగాను. నేను తప్పు చేయలేదు' అని  వ్యాఖ్యానించారు. 
సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం
‘సంతకం, తేదీ లేకుండా ఎమ్మెల్యే పి.శంకర్రావు గుడ్డిగా రాసిన రెండు పేజీల లేఖను పిల్‌గా స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ  అన్ని ఆధారాలతో టీడీపీ అధినేత చంద్రబాబుపై వేసిన  రెండువేల ఐదువందల పేజీల  పిటిషన్‌ను తిరస్కరించడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని,   ఒకే రకమైన రెండు కేసుల్లో భిన్నమైన తీర్పులు రావడం ఆశ్చర్యకరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పద్మ చెప్పారు.





 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...