Monday, February 20, 2012

శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు

హైదరాబాద్,ఫిబ్రవరి 20:  మహాశివరాత్రి  సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే శివాలయాలకు క్యూ కట్టారు.  ఈసారి శివరాత్రి సోమవారం రావడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కాళేశ్వరం, ద్రాక్షారామం, కోటప్పకొండ తదితర క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి ని పురస్కరించుకుని అన్ని క్షేత్రాల్లోనూ ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లకు దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య రాష్ట్ర ప్రభుత్వం తరఫున  పట్టువస్త్రాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామంలో కొలువుదీరిన భీమేశ్వరుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.  కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ్లను ప్రభుత్వం రాష్ర్ట పండుగగా గుర్తించిన నేపథ్యంలో ఈసారి ఘనంగా ఏర్పాట్లు చేశారు. త్రికోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో వైభవంగా అలంకరించారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానం చేసేందుకు భక్తులు పోటెత్తారు.  రంగారెడ్డి జిల్లా కీసరలోనూ భక్తులు పోటెత్తారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...