బెదిరిస్తున్న యడ్యూరప్ప...
బెంగళూరు,ఫిబ్రవరి 24: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప బీజేపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తన పుట్టినరోజైన ఈ నెల 27లోగా తనకు తిరిగి సీఎం పదవి ఇచ్చి తీరాలని డెడ్‌లైన్ విధించారు. లేనట్లయితే తన దారి తాను చూసుకుంటానంటూ హెచ్చరిక చేశారు. శుక్ర, శనివారాల్లో బెంగళూరు శివార్లలోని ఓ రిసార్టులో జరుగనున్న పార్టీ మేధోమథన సదస్సుకు అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వస్తున్న నేపథ్యంలో యడ్యూరప్ప బలప్రదర్శనకు దిగారు. గురువారం ఇక్కడి రేస్ కోర్సు రోడ్డులోని తన నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన ‘విందు’ సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎంపీలు హాజరయ్యారు. సదానందగౌడ సీఎం అభ్యర్థిత్వానికి గతంలో యడ్యూరప్ప మద్దతిచ్చినప్పుడు వ్యతిరేకించిన గ్రామీణాభివృద్ధి మంత్రి జగదీష్ షట్టర్, హోంమంత్రి ఆర్. అశోక కూడా ఈ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. అలాగే బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె.ఎస్. ఈశ్వరప్ప కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments