Wednesday, November 3, 2010

మధ్యంతర ఎన్నికలలో ఒబామాకు ఎదురుదెబ్బ...

వాషింగ్టన్,నవంబర్ 3: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆర్థిక విధానాలపై ఆ దేశ ప్రజల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తి మధ్యంతర ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.  అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో నిన్నటివరకూ తిరుగులేని మెజారిటీతో ఉన్న అధికార డెమోక్రటిక్ పార్టీ మైనారిటీలో పడిపోయింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ భారీగా సీట్లు గెలుచుకుని సభ పై పట్టు సాధించింది.  పగ్గాలు చేపట్టటానికి సిద్ధమైంది. సెనేట్‌లో కూడా  డెమోక్రటిక్ పార్టీ కనీస మెజారిటీ దక్కించుకోగలిగినా అక్కడ కూడా గతం కన్నా సీట్లు తగ్గిపోవడం గమనార్హం. అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 100 సీట్లకు గాను 37 స్థానాలకు, 37 రాష్ట్రాల గవర్నర్ పదవులకు మంగళవారం ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలో రాష్ట్ర, స్థానిక ఎన్నికలు కూడా జరిగాయి. కోట్లాది మంది అమెరికన్లు ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారు. ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభలో అధికార డెమోక్రటిక్ పార్టీకి 235 స్థానాలు ఉండగా, రిపబ్లికన్ పార్టీకి 178 స్థానాలు ఉండేవి. మరో రెండు స్థానాలు ఖాళీగా ఉండేవి. సెనేట్‌లో డెమోక్రాట్లకు 59, రిపబ్లికన్లకు 41 సీట్లు ఉండేవి. మంగళవారం జరిగిన ఎన్నికలకు సంబంధించి పలు స్థానాల్లో ఇంకా ఫలితాలు వెలువడాల్సి వున్నప్పటికీ ఇంతవరకు ఫలితాల ప్రకారం డెమోక్రటిక్ పార్టీ భారీగా దెబ్బతింది. 435 సీట్ల ప్రతినిధుల సభలో అధికార డెమోక్రాట్ల బలం 184కు పడిపోయింది. రిపబ్లికన్లు 239 సీట్లు గెలుచుకున్నారు. మరో 12 సీట్ల ఫలితాలు వివాదంలో ఉన్నాయి. అలాగే, 100 సీట్ల సెనేట్‌లో ప్రస్తుతం 59గా ఉన్న డెమోక్రాట్ల బలం 51కి పడిపోయింది. రిపబ్లికన్ల బలం 46కు పెరిగింది. మరో మూడింటి ఫలితాలు తేలాల్సి ఉంది. తాజా ఎన్నికల్లో డెమోక్రాట్ల నుంచి రిపబ్లికన్లు 8 సీట్లు గెలుచుకున్నారు. అదేవిధంగా 37 రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు జరగగా.. డెమోక్రాట్లకు కేవలం 14 చోట్ల మాత్రమే గెలవగలిగే పరిస్థితి. మరో 9 రాష్ట్రాలను వారు ప్రతిపక్షానికి వదులుకోనున్నారు. రిపబ్లికన్లు 27 గవర్నర్ పదవులను చేజిక్కించుకున్నారు. ఒకప్పుడు ఒబామా ప్రాతినిధ్యం వహించిన ఇలినాయి సెనేట్ స్థానాన్ని కూడా రిపబ్లికన్లు గెలుచుకున్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...