Tuesday, January 21, 2014

మహానటుని మహాభినిష్క్రమణం...

హైదరాబాద్, జనవరి 22:
మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు  మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున  2 గంటల సమయంలో ఆయన  హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అక్కినేని తెల్లవారుజాము 1.30కు తీవ్ర అస్వస్థతతో గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన  ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి చాలావరకు విషమించింది. వైద్యులు  అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఆఖరి క్షణాల్లో కుమారుడు, సినీ నటుడు నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులంతా ఆయనతోనే ఉన్నారు. అక్కినేని తన సుదీర్ఘ నట జీవితంలో 256 సినిమాల్లో నటించారు. దాదాసాహెబ్ ఫాల్కే నుంచి పద్మవిభూషణ్ దాకా పలు అవార్డులు అందుకున్నారు. తాను కేన్సర్ బారిన పడినట్లుగా గత ఏడాది అక్టోబర్ 19న ఆయన మీడియా సమావేశం లో  చెప్పారు. ఆత్మబలంతో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించిన అక్కినేని  1924 సెప్టెంబర్ 20 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించారు.  చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో నాయిక (ఆడ) పాత్రలను పోషించారు.  1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన  మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). ఆ చిత్రంలో రాముని పాత్రతో ప్రారంభించిన నటజీవితం బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, తోడికోడళ్ళు, బాటసారి, అనార్కలి, మూగమనసులు, మంచిమనసులు, ఆత్మబలం, అంతస్తులు, ఇద్దరు మిత్రులు, అమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం, సెక్రెటరీ, మహకవి క్షేత్రయ్య, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, కాలేజీ బుల్లోడు, శ్రీ రామదాసు మొదలైన చిత్రాల్లోని పాత్రలతో అప్రతిహతంగా కొనసాగింది.   మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు. "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను శ్రీ ఆదుర్తి సుబ్బారావుతో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించారు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు  అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఎ. ఎన్. ఆర్. కాలేజీ గా పేరు పెట్టారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశారు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు.అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా.. కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.అన్నపూర్ణ 28.12.2011 న మృతి చెందారు. నాగేశ్వర రావు మ్ర్టితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...