Thursday, November 4, 2010

ఒబామాకు అసాధారణ రక్షణ వలయం

ఒబామా బస చేసే ముంబై తాజ్ హోటల్ వద్ద అమెరికా సెక్యూరిటీ వాహనం
న్యూఢిల్లీ,నవంబర్ 4: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సన్నాహాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.  మందీ మార్బలం అంతా ఆయన వెంటే తరలి వస్తోంది. ముంబై, ఢిల్లీలలో సాగే మూడు రోజుల పర్యటన కోసం వైట్‌హౌస్ సిబ్బందిలో అధిక సంఖ్యాకులు అధ్యక్షుని వెంటే తరలి వస్తున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, వైట్‌హౌస్ సిబ్బంది, జర్నలిస్టులు సహా దాదాపు మూడువేల మంది ఒబామాతో వస్తున్నారు. నిరంతర రక్షణ కోసం ఒక విమాన వాహక నౌక సహా 34 అమెరికా యుద్ధ నౌకలు ముంబై తీరం వద్దకు చేరుకోనున్నాయి. ముంబై తీరం వెంబడి ఇవి గస్తీ తిరుగుతాయి. ముంబైలో రెండేళ్ల కిందట దాడులు జరిపిన ఉగ్రవాదులు, సముద్ర తీరం నుంచే చేరుకోవడంతో, ముందు జాగ్రత్తగా ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ‘న్యూక్లియర్ బటన్’, సొంత కమ్యూనికేషన్ల ఏర్పాట్లతో ఒబామా ఇక్కడకు వస్తున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి ఒబామా, ‘మెరైన్ వన్’ హెలికాప్టర్‌లో దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉన్న భారత నావికాదళం హెలిబేస్ ‘షిక్రా’కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో సమీపంలో ఉన్న తాజ్ హోటల్‌కు చేరుకుంటారు. ఒబామా కాన్వాయ్‌లో నలభై వాహనాలు ఉంటాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థ కలిగిన రెండు జెట్ విమానాలు కాన్వాయ్ మీదుగా ఎగురుతూ రక్షణగా ఉంటాయి. ఒబామా, ఆయన వెంట వచ్చే సిబ్బంది, ఇతర ప్రతినిధుల కోసం తాజ్, హ్యాత్ హోటళ్లలో ఇప్పటికే 800 గదులు బుక్ అయ్యాయి. ఒబామా చుట్టూ అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, కేంద్ర పారా మిలటరీ బలగాలు భద్రతా వలయంగా నిలుస్తారు. ఢిల్లీలో కూడా దాదాపు ఇలాంటి ఏర్పాట్లే ఉంటాయి. ఢిల్లీలో ఒబామా ఆదివారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉంటారు. ఆయన కోసం ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం నిరంతరం సిద్ధంగా ఉంటుంది. ఢిల్లీలోని మౌర్య హోటల్‌లో ఆయన బస చేస్తారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...