Friday, November 12, 2010

వ్యాఖ్యల పై కే.సీ.ఆర్. వివరణ

న్యూఢిల్లీ,నవంబర్,12: తన మాటలను మీడియా వక్రీకరించిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్ ని కలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తాను అనలేదని, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని మాత్రమే చెప్పానని వివరించారు. పార్లమెంట్'లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే తాము బలపరచవలసి ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన కోరారు. డిసెంబరు 9న చేసిన ప్రకటనను అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 31 తరువాత కేంద్ర ప్రభుత్వం తను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని కోరారు. 1956 అక్టోబర్ 31న ఏ తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారో అదే తెలంగాణ తమకు కావాలని దుగ్గల్ ని తాను కోరినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చితీరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలావుండగా, అధ్యక్షుడు చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాకతీయ యూనివర్సిటీ జెఎసి విద్యార్థులు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కెసిఆర్ తన వైఖరి మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. కెసిఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని వారు ఆరోపించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...