Thursday, January 28, 2016

బాబు ప్రచారం దండగ...మాదే పండగ...కె.సి.ఆర్.

హైదరాబాద్,జనవరి 28; గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యడానికి కోతల్లేని కరెంట్ చాలు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోతే చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని విష ప్రచారం చేశారు. 30 ఏళ్ల పాటు నెలకొన్న దుస్థితికి, విష ప్రచారాలకు తెరదించాం. ఇప్పుడు నగరంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. గతంలో విద్యుత్ లేక పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
బాబు ప్రచారం దండగ ..... చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రచారం చేయడం అసంబద్ధమని కేసీఆర్ అన్నారు. .. ఇప్పుడు చంద్రబాబుకు తెలంగాణతో ఏం పని? ఆయనకు విజయవాడలో బోలెడంత పని ఉంది. చంద్రబాబు పాలన గురించి చెప్పాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా ఉంది. చంద్రబాబు ప్రచారం చేయడం వృథా ప్రయాస. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధి ఏం చేస్తారు? బాబు, ఆయన మామ ఏం చేశారు హైదరాబాద్‌కు? అధికారంలో లేని వారు హైదరాబాద్‌కు ఏమి చేయరు. ఇంత చిన్న విషయం కూడా గుర్తించకుండా ప్రచారానికి రావడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడానికి టీడీపీ, కాంగ్రెస్సే కారణమని తెలిపారు. 
కొత్త  సచివాలయం ... జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కొత్త సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి టవర్స్‌కు రూపకల్పన జరుగుతుంది. హైదరాబాద్‌కు ఇరువైపులా మరో రెండు రైల్వే స్టేషన్లను నిర్మిస్తాం. ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లు సరిపోవడం లేదు. నగరానికి నాలుగు వైపులా కొత్త బస్టాండ్లను నిర్మిస్తాం. ఇక గుడిసెలో ఉండే వారికే కాకుండా.. కిరాయి ఇండ్లలో ఉండే వారికి డబుల్ బెడ్‌రూమ్స్ కట్టించి ఇస్తాం. గతంలో ఇందిరమ్మ ఇండ్లలో కుంభకోణం జరిగింది. తాము కట్టించే డబుల్ బెడ్‌రూమ్స్‌లో రాజకీయ జోక్యం ఉండదు అని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో రూ. 30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చి పోలీసు శాఖను ఆధునీకరించామని చెప్పారు. ఆకతాయిల ఆగడాలను షీ టీమ్స్ ద్వారా ఆరికట్టగలిగామని తెలిపారు. 
480 వేల కోట్లతో సంక్షేమ పథకాలు ... రాష్ట్ర వ్యాప్తంగా రూ. 480 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. .నిరుపేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్స్ కట్టించి ఇస్తాం. అర్హులందరికీ ఆసర పింఛన్లు, దళిత ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మీ, ముస్లిం యువతులకు షాదీముబారక్ ద్వారా వారి వివాహాలకు రూ. 51 వేలు ఇస్తున్నాం. హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. 10 లక్షల మంది డ్రైవర్లకు బీమా కల్పించాలి. జీవో 58 కింద లక్ష మందికి పట్టాలిచ్చాం. జంటనగరాల అభివృద్ధికి రూ. 38 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని , ఆటోలకు రవాణా పన్ను మాఫీ చేశామని తెలిపారు.
విజ్ఞత తో వోటు ... గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలంతా పాల్గొనాలని సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. జంట నగరాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనరు అనే అపవాదు ఉంది. ఈ అపవాదును జంటనగరాలు పారద్రోలాలి. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యస్ఫూర్తిని, విజ్ఞతను ప్రదర్శించాలి. గ్రేటర్ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీల్లో తెలంగాణలో ఒక్కటీ లేదని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి వెంకయ్య ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పక్షపాత వైఖరికి కూడా హద్దు ఉండాలన్నారు. గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమైందని కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్‌లో అతి పెద్ద పార్టీగా టీఆర్‌ఎస్ ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ తమ మిత్ర పక్షమేనని అన్నారు. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...