Friday, February 21, 2014

ప్రత్యేక హోదా ప్రయోజనాలు... !

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ గురువారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  1969లో తొలిసారి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది.   ఐదు అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా కల్పిస్తారు.-కొండ ప్రాంతాలు, ఆవాసానికి కష్టసాధ్యమైన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు,-తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు,- దేశ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ప్రాంతాలు ఉన్న, విదేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలకు-ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా, సామాజికంగా బాగా వెనకబడిన రాష్ట్రాలకు ..ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం ఉంది.
- 1969 నాటికి అసోం, జమ్ము-కశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. ప్రస్తుతం పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అవి.. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్. - 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఎన్డీయే సర్కారు ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించింది. దీనికి కారణం..ఉత్తరాఖండ్ కూడా వేరే దేశం (టిబెట్ )తో సరిహద్దు పంచుకోవడం. దీనికితోడు ఆ రాష్ట్రమంతా పర్వత ప్రాంతమయం.
ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వనరుల కేటాయింపులో అత్యధిక వాటా లభిస్తుంది.  ఆ రాష్ట్రాలకు పరిశ్రమలు, ఉత్పాదక సంస్థలను తరలించేందుకు, తిరిగి ఏర్పరచేందుకు వీలైన విధంగా చెప్పుకోదగిన రీతిలో ఎక్సైజ్ సుంకం మినహాయింపులు లభిస్తాయి. దీనివల్ల  పరిశ్రమలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఉద్యోగావకాశా లు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. పేదరికం తగ్గుతుంది.  కేంద్రం ప్రణాళికా వ్యయానికి అందించే స్థూల బడ్జెటరీ మద్దతులో 30 శాతం లభిస్తుంది. అలాగే  ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రణాళికా సాయంలో 90 శాతం మేర గ్రాంట్ల రూపంలోనూ.. మిగతా 10 శాతాన్ని రుణాల రూపేణా అందిస్తారు. మామూలు రాష్ట్రాలకు ఈ వాటా 70-30 శాతంగా ఉంటుంది.  నిర్దిష్ట కాలపరిమితి వరకే ప్రత్యేక హోదా ఉంటుందని ప్రకటించిన రాష్ట్రాలకు.. ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత ఇంకా ఆ హోదా అవసరమని కేంద్రం భావిస్తే  మరింత పొడిగించే అవకాశం ఉంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా..? వద్దా..? అన్న విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీని ఈ రెండు సంఘాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర ప్రణాళికల కోసం ఉద్దేశించిన నిధులను కేంద్ర సహాయం కింద ప్రణాళికా సంఘం ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తుంది.  కేంద్ర సాయం మూడు రకాలుగా ఉంటుంది. సాధారణ కేంద్ర సాయం (ఎన్‌సీఏ), అదనపు కేంద్ర సాయం (ఏసీఏ), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్‌సీఏ). ఎన్‌సీఏ కేటగిరీ కింద అందించే మొత్తం సాయంలో 30 శాతం గ్రాంట్ల రూపంలో అందుతుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. 90 శాతం గ్రాంట్లు, 10 శాతం రుణాల ఫార్ములాను కేంద్ర ప్రాయోజిక పథకాలు, విదేశీ సాయంతో నడిచే పథకాలకు వర్తింపజేస్తారు.
 ప్రస్తుతం రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం, ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండటం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రత్యేక హోదా కల్పించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...