Thursday, February 20, 2014

ఎన్నికల తర్వాతే ' విభజన' అమలు...?

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 20:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సభాపరంగా సంపూర్ణమైంది.  ఇక రాష్ట్రపతి సంతకం  ఆ తరువాత  నోటిఫికేషన్ వెలువడగానే ఒక భాష, రెండు రాష్ట్రాలు , ఒక జాతి... రెండు రాష్ట్రాలు అమలులోకి వస్తాయి.  పది జిల్లాలతో నవ తెలంగాణ... పదమూడు జిల్లాలతో 'సరికొత్త' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆవిర్భవిస్తాయి.  మంగళవారం అరకొర చర్చ, అంతులేని గందరగోళం మధ్య లోక్‌సభలో ఆమోదం పొందిన 'ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014' పై... గురువారం నిరంతర నిరసనలు,  గందరగోళం మధ్యే చర్చ, మూజువాణీ ఓటింగ్‌తో రాజ్యసభ సైతం ఆమోదముద్ర వేసింది. సీమాంధ్ర ఎంపీలతోపాటు... తృణమూల్ సభ్యులు వెల్‌లో నిరసనలతో హోరెత్తించారు. ఈ నిరసనల మధ్యే బిల్లును, ఆ తర్వాత అధికారిక సవరణలను మూజువాణీ ఓటుద్వారా ఆమోదించారు. బిల్లును లోక్‌సభ 'మమ' అనిపిస్తే.. రాజ్యసభ మాత్రం సుదీర్ఘంగా చర్చించి రాత్రి మూజువాణీ ఓటుతో ఆమోదించింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలను సస్పెండ్ చేసి, పెద్దగా చర్చ లేకుండానే విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపితే... పెద్దల సభ మాత్రం తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. చర్చ తర్వాతే బిల్లుకు ఆమోదం తెలిపింది. సభలో ఆందోళన చేస్తున్న వారిలో ఒక్క ఎంపీని కూడా సస్పెండ్ చేయలేదు. అన్ని పార్టీలూ చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. అధికార, ప్రతిపక్షాల మధ్య పలు విడతల్లో జరిగిన చర్చలు, కుదిరిన రాజీ ఒప్పందాల నేపథ్యంలో... బిల్లు ఆమోదానికి బీజేపీ రాజ్యసభలోనూ పూర్తిగా సహకరించింది. సీమాంధ్ర కోణంలో బీజేపీ అభ్యర్థనపూర్వకంగా చేసిన కొన్ని ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించింది. అందులో భాగంగానే... ఆంధ్రప్రదేశ్‌కు (సీమాంధ్ర) ఐదేళ్లపాటు 'ప్రత్యేక కేటగిరీ' హోదా ప్రకటించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో స్వయంగా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక కేటగిరీ హోదా పదేళ్లపాటు ఉండాలని బీజేపీ నేత వెంకయ్య డిమాండ్ చేయగా... 'పదేళ్లు కాదు, ఐదేళ్లే' అని హోంమంత్రి షిండే స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అమలైన తొలి సంవత్సరం... ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు ఏర్పడితే దానిని కేంద్రమే భరిస్తుంది. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, శాంతిభద్రతల నిర్వహణ అధికారాన్ని గవర్నర్‌కు అప్పగించడానికి రాజ్యాంగ సవరణ అవసరంలేదని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ స్పష్టం చేశారు. .  ఉభయ సభల్లో బిల్లు గట్టెక్కగానే... తెలంగాణ వాదులు మరోమారు సంబరం చేసుకున్నారు.
తెలుగు వారిగా కలిసి ఉందాం-కె.సి.ఆర్.
'భౌగోళికంగానే విడిపోయాం. తెలుగు వారిగా కలిసి ఉందాం. కలిసి అభివృద్ధి చెందుదాం.. హైదరాబాద్‌లోని తెలుగు వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు'... అని టీఆర్ఎస్ అధిపతి కేసీఆర్, టీ-జేఏసీ అధ్యక్షుడు కోదండరాం తదితరులు హామీ ఇచ్చారు.
  ఎన్నికల తర్వాతే 'అప్పాయింట్ డే  ?
పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడంతో... ఇక రాష్ట్రపతి ఇవ్వబోయే 'అప్పాయింట్ డే' (రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే తేదీ)పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆదాయ వనరులు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ వంటివన్నీ సంతృప్తికరంగా పూర్తి చేసేందుకు కావాల్సినంత సమయముండేలా చూసుకొని... అప్పాయింట్ డే నిర్ణయిస్తారు. మరోవైపు... ఇప్పటికిప్పుడు విభజన అమలులోకి వస్తే... రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల, ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిపి, ఆ తర్వాత 'అప్పాయింట్ డే' ప్రకటిస్తారని తెలుస్తోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...