Thursday, February 27, 2014

హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణకే.... ప్రత్యేక హోదాతో సీమాంధ్రకు 90 శాతం కేంద్ర నిధులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయం మొత్తం తెలంగాణకే చెందుతుందని, సీమాంధ్రకు వెళ్లదని కేంద్రం మంత్రి జైరాం రమేష్ పేర్కొన్నారు.  ఎన్నికల కోసమే రాష్ట్రాన్ని విభజించారని వస్తున్న ఆరోపణలను ఖండించారు. తెలంగాణ డిమాండ్ 60 ఏళ్ళ నుంచి ఉందని, 1969, 70లో తెలంగాణ, జైఆంధ్ర ఉద్యమాలు వచ్చాయని ఆయన అన్నారు. 2004లోనే తెలంగాణపై కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, 2009 ఎన్నికల్లో తెలంగాణపై వైఎస్ హామీ ఇచ్చారని జైరాం రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై 2013లో సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. విభజన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లపాటు చర్చలు జరిపామని, తెలంగాణ బిల్లు రాజ్యాంగబద్ధంగా రూపొందించినట్లు జైరాం రమేష్ తెలిపారు. తాము సీమాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. చారిత్రక, రాజకీయ కారణాలతో విడదీసినా తెలుగు వారంతా ఒక్కటే అన్నారు. సీమాంధ్రకు ఆరు సూత్రాల పథకం అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారని  జైరాం రమేష్  చెప్పారు. ప్రత్యేక హోదాతో సీమాంధ్రకు 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుందని ఆయన చెప్పారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందన్నారు. పోలవరంను బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేస్తుందని, రెండు రాష్ట్రాల్లో 371డి కొనసాగుతుందని, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు ఆప్షన్స్ ఉంటాయని జైరాం రమేస్ స్పష్టం చేశారు.  అపాయింటెడ్ డే ప్రకటించడానికి భారీగా కసరత్తు జరగాల్సి ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు మూడు నెలలు పట్టిందని  ఆయన గుర్తు చేశారు.  ఐదేళ్లలో సీమాంధ్రకు కేంద్రం నుండి యాభైవేల కోట్ల రూపాయలు వస్తాయని జైరాం రమేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు తొంబై శాతం నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 84వేల మంది ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. సీమాంధ్రకు ఐఐటి, ఎయిమ్స్, సూపర్ స్పెషల్ ఆసుపత్రులు వస్తాయని జైరాం రమేష్ పేర్కొన్నారు.  ఇప్పుడున్న ప్రాజెక్టులు యథాతథంగా ఉంటాయని, తెలంగాణ విషయంలో కోర్టుకు వెళ్లినా ఇబ్బందులు ఏమీ ఉండవన్నారు.  ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు డిపిఆర్ హోదా లేదని, అందుకే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేకపోయామని జైరాం రమేష్  పేర్కొన్నారు.
కేసీఆర్ పై విమర్శ..
 సామాజిక తెలంగాణ కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కేసీఆర్ అధికారంలోకి వస్తే దొరల రాజ్యమవుతుందని ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. జాగో బాగో నినాదాలతో కేసీఆర్ సీమాంధ్ర  ప్రజలను రెచ్చగొట్టారని, ఆయన చేసిన వ్యాఖ్యలతో సీమాంధ్ర ప్రజలు భయాందోళనలకు గురయ్యారని జైరాం రమేస్ టీ. జేఏసీ నేతలతో అన్నారు. కాంగ్రెస్‌లో విలీనం కాకపోతే టీఆర్ఎస్ పార్టీ కూడా మరో ఆమ్ఆద్మీ పార్టీ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి జాతీయ పార్టీలతోనే సాధ్యమని జైరాం రమేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నిస్తామని ఆయన టీ.జేఏసీ నేతలకు హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరండని టీ.జేఏసీ నేతలను ఈ సందర్భంగా ఆయన ఆహ్వానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...