Thursday, December 5, 2013

విభజన దిశగా మరో ముందడుగు...10 జిల్లాల తెలంగాణాకు కేంద్ర కేబినెట్‌ ఓ.కె.

న్యూఢిల్లీ, డిశంబర్ 5: :  రాష్ట్ర విభజనపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013’ ముసాయిదాను గురువారం ఆమోదించింది. హైదరాబాద్ నగరాన్ని జీహెచ్‌ఎంసీ పరధిలో పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా చేస్తూ.. అందులో శాంతిభద్రతల బాధ్యతలను గవర్నర్‌కు అప్పగిస్తూ.. కృష్ణా, గోదావరి నదులపై నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేస్తూ.. ఆస్తులు, అప్పుల పంపకానికి సవివరమైన విధివిధానాలను నిర్దేశిస్తూ రూపొందించిన ఈ బిల్లును శుక్ర, శనివారాల్లో రాష్ట్రపతికి పంపిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే వెల్లడించారు. బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభిప్రాయం తీసుకోవాలని రాష్ట్రపతిని కోరతామని.. ఆయన ఆ బిల్లును అసెంబ్లీకి పంపిస్తారని ఆయన చెప్పారు. అసెంబ్లీ నుంచి బిల్లు వచ్చిన తర్వాత తిరిగి కేంద్ర
విభజన ఇలా..
కేబినెట్‌లో చర్చించి తుది బిల్లును ఖరారు చేసి పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ నివాసంలో  మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగిన కేంద్ర కేబినెట్  సమావేశానికి.. కేంద్రమంత్రులైన ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా హాజరుకాలేదు. రాష్ట్ర విభజనపై తన అధ్యక్షతన ఏర్పాటయిన జీవోఎం ఏడు సార్లు సమావేశమైందని.. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులతో కూడా చర్చలు జరిపిందని షిండే పేర్కొన్నారు. జీవోఎంకు 11 అంశాలపై వచ్చిన 18 వేల వినతులను పరిశీలించామని తెలిపారు. తమకు ఇచ్చిన 11 మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గానికి సిఫారసులు చేశామని చెప్పారు.
విభజన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలు, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉంటాయని షిండే ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతం ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల కాలానికి మించకుండా ఉంటుందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి ప్రాణ, ఆస్తి, స్వాతంత్య్రాల భద్రతను కాపాడే ప్రత్యేక బాధ్యతను తెలంగాణ గవర్నర్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ అంశంలో గవర్నర్‌కు సహకారం అందించడానికి ఇద్దరు సలహాదారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు.విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిని గుర్తించటానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఇది 45 రోజుల్లో సిఫారసులు సమర్పిస్తుందని వెల్లడించారు. కొత్త రాజధాని నిర్మాణానికి, రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వనరుల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రమేయంతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, ఆస్తులు, అప్పులతో పాటు బొగ్గు, విద్యుత్, చమురు, సహజవాయువుల పంపిణీకి అనుసరించాల్సిన విధానాలను రూపొందించామన్నారు. విద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పనకు వీలుగా రాజ్యాంగంలోని 371డీ అధికరణ రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందని చెప్పారు. ఉన్నత విద్యా సంస్థలు, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే ఐదేళ్ల పాటు కొనసాగించనున్నామన్నారు.ఇరు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...