Sunday, October 28, 2012

అవినీతి ఆరోపణల మంత్రికి అందలం....ఖుర్సీద్ కు ఏకంగా విదేశాంగ శాఖ కేటాయింపు... పురంధేశ్వరికి ఆశాభంగం-ప్రమోషన్ లేకుండా శాఖ మార్పుతో సరి

 
న్యూఢిల్లీ,అక్టోబర్ 28:  ప్రధాని మన్మోహన్‌సింగ్  ఆదివారం నాడు తన కేబినెట్‌లో  భారీగా మార్పులు చేర్పులూ చేశారు. 22 మందిని కేబినెట్‌లోకి తీసుకున్న మన్మోహన్, మరో 22 మంది శాఖలను(మొత్తంగా 44 మా ర్పులు, చేర్పులు) మార్చారు. దీంతో మొత్తం కేబినెట్ సభ్యుల సంఖ్య 78కి (రాజ్యాంగం అనుమతించే సంఖ్య 81కి కేవలం మూడు తక్కువ)చేరింది.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖుర్షీద్‌ను..విదేశాంగ మంత్రిగా అందలం ఎక్కించడం ఈ పునర్వ్యవస్థీకరణలో గమనార్హం. కాగా, రాష్ట్రానికి చెందిన ఎం.ఎం.పళ్లంరాజు, కె.చిరంజీవి, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, పోరిక బలరాం నాయక్, కిల్లి కృపారాణితో సహా మొత్తం 22 మంది కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో కె.రెహ్మాన్‌ఖాన్, దిన్‌షా జె.పటేల్, అజయ్ మాకెన్, ఎం.ఎం.పళ్లంరాజు, అశ్వనీకుమార్, హరీష్ రావత్, చంద్రేష్ కుమారి కటోచ్‌లు(మొత్తం ఏడుగురు) కేబినెట్ హోదా మంత్రులుగా.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ, రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా.. శశి థరూర్, కోడైకున్నిల్ సురేష్, తారిక్ అన్వర్, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, రాణీ నారహ్, అధీర్‌రంజన్ చౌధురి, ఎ.హెచ్.ఖాన్ చౌధురి, సర్వే సత్యనారాయణ, నినాంగ్ ఇరింగ్, దీపా దాస్ మున్షీ, పోరిక బలరాం నాయక్, కిల్లి కృపారాణి, లాల్‌చంద్ కటారియాలు(మొత్తం 13 మంది) సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.    పళ్లంరాజుకు పదోన్నతి లభించింది. అయితే, కేబినెట్ హోదా దక్కుతుందని ముందు నుంచి ప్రచారం జరిగిన పురందేశ్వరి అవకాశాలకు కావూరి రాజీనామా లేఖాస్త్రం గండి కొట్టినట్టు సుస్పష్టమైంది.ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి వాణిజ్యం, పరిశ్రమల శాఖకు మార్చారు.ఇప్పటివరకూ రక్షణ శాఖ సహాయమంత్రిగా ఉన్న పళ్లంరాజుకు కేబినెట్ హోదా ప్రమోషన్ ఇచ్చి, కీలకమైన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖను అప్పగించారు. ప్రజారాజ్యం పార్టీని బేషరతుగా విలీనం చేసిన సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తూ చిరంజీవికి స్వతంత్ర ప్రతిపత్తితో పర్యాటక శాఖను కేటాయించారు. సహాయ మంత్రులుగా కేబినెట్‌లో చేరిన కోట్లకు రైల్వేశాఖ, సర్వేకు రహదారులు, రోడ్డు రవాణా శాఖ, బలరాం నాయక్‌కు సామాజిక న్యాయం, సాధికారత శాఖ, కృపారాణికి కమ్యూనికేషన్లు, ఐటీ శాఖను ఇచ్చారు. కొత్త మంత్రుల చేరికతో కేబినెట్‌లో రాష్ట్ర ప్రాతినిధ్యం 11(రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జైరాం రమేశ్‌కు కలుపుకుని)కి పెరిగింది.  భార్య ఎన్‌జీవో అక్రమాల వివాదంలో నోరుజారి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను తొలగిస్తారని అందరూ భావించగా.. అందుకు పూర్తి భిన్నంగా ఆయనకు కేబినెట్‌లోని ‘టాప్ 4’లో స్థానం కల్పించడం విశేషం. 

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...