Friday, June 22, 2012

' చిరు ' బుర్రు...

హైదరాబాద్,జూన్ 22: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు  రసకందాయంలో పడినట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలలో రెండు నియోజకకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి  పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లపై  ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది.ఆయన శుక్రవారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో తీవ్ర చర్చను లేవనెత్తుతున్నాయి. రామచంద్రాపురం, నర్సాపురం సీట్లలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినవారే కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించడం చిరంజీవికి కలిసి వచ్చింది. రామచంద్రాపురం పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం లభించడం కలేనని  సంచలన వ్యాఖ్యలు చేశారు.  పీఆర్పీ కార్యకర్తలను కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్లే ఉపఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ నేతలకు సరైన గుర్తింపు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పీఆర్పీ మాజీ నేతలంతా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారని చెప్పారు. పార్టీలో సీనియర్లు కొందరు సహకరించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. నామినేటెడ్ పదవులను పీఆర్పీ నేతలకు ఇవ్వాలని కోరారు.  2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాదని కాంగ్రెసు పెద్దలు డిసైడ్ అయిపోయారని, అందుకే కష్టపడి పనిచేయడం లేదని ఆయన అన్నారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్న సమయంలో చిరంజీవి రామచంద్రాపురం కార్యకర్తలను ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...