Wednesday, March 14, 2012

మమత మండిపాటు-త్రివేది సర్దుబాటు

న్యూఢిల్లీ,మార్చి 14:  ప్రయాణికుల చార్జీలు పెంచడంపై రైల్వే మంత్రి దినేష్ త్రివేదిపై తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బడ్జెట్‌లో చార్జీలు పెంచుతూ దినేష్ త్రివేది చేసిన ప్రతిపాదనలను  ఉపసంహరించుకోవాలని తృణమూల్ కాంగ్రెసు నేత సుదీప్ బందోపాధ్యాయ డిమాండ్ చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలపై తమ పార్టీ రైల్వే మంత్రి దినేష్ త్రివేదితో చర్చించలేదని కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెసు నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. పేద ప్రజల ప్రయోజనాలను కాపాడాలని తమ నేత మమతా బెనర్జీ తమకు బోధించారని, అందువల్ల చార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.
 కాగా, ప్రయాణికుల చార్జీలు పెంచుతున్న విషయం తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తెలియదని, బడ్జెట్‌కు తాను పూర్తి బాధ్యత వహిస్తానని త్రివేది అన్నారు. మమతా బెనర్జీ ఎప్పుడూ తన శాఖలో తలదూర్చలేదని చెప్పారు. బడ్జెట్ కు సంబంధించి ఆమెని తాను సలహాలు గానీ, సూచనలు గానీ అడగలేదన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడంలో తన విధిని తను నిర్వర్తించానన్నారు. రైల్వే బడ్జెట్ కు టిఎంసికి సంబంధంలేదని స్పష్టం చేశారు. రైల్వేకు ఎయిరిండియా గతి పట్టకూడదనే చార్జీలు పెంచానని  దినేష్ త్రివేది  వివరణ ఇచ్చారు. ఐసియులో ఉన్న రైల్వే వ్యవస్థని బయటకు తెచ్చానన్నారు. రైల్వేకు ఏది మంచిదో అదే చేశానని చెప్పారు. అందరూ అన్నీ కావాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు. పెంచిన చార్జీలు తగ్గించే ప్రసక్తిలేదని తెగేసి చెప్పారు. అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...