Thursday, March 29, 2012

రాజకీయ ' చిరు ' నామా ఇక ఢిల్లీ...!

హైదరాబాద్ ,మార్చి 29: తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి తన సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. ఆయన రాజ్య సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. గురువారం బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు నేరుగా అందచేశారు.  కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనమయ్యాక చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం దక్కింది. దీనితో  ఆయన తిరుపతి శాసనసభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. రాజ్యసభకు వెళ్లినప్పటికి తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. కాగా అసెంబ్లీ లాబీల్లో చిరంజీవికి తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా  చిరును చూసిన రేవంత్.. రాజ్యసభకు వెళ్తున్నారు.. ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడే మంత్రి పదవి తీసుకోండి అని చెప్పారు. అందుకు చిరంజీవి స్పందిస్తూ.. తన చేతుల్లో ఏమీ లేదని వాళ్లు ఇచ్చింది తీసుకోవాలని చిరునవ్వుతో సమాధానం చెప్పారు. కాగా గత డిసెంబర్ నెలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో చిరంజీవి ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. ఆ సమయంలోనే అధిష్టానం చిరుకు కేంద్రమంత్రి పదవి హామీ ఇచ్చింది. ఇప్పుడు  ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయడంతో కేంద్రంలో మంత్రి పదవి ఖాయమని వాదన వినిపిస్తోంది. అయితే క్యాబినెట్ మంత్రా లేక సహాయ మంత్రి తో సరిపెడతారా అనేది వేచి చూడాలి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...