Wednesday, March 21, 2012

రాజీనామా స్థానాలు మళ్ళీ తెరాసాకే... మహబూబ్ నగర్లో మురిసిన భాజపా...కోవూరులో మెరిసిన వైకాపా

హైదరాబాద్,మార్చి 21:  ఉప ఎన్నికల్లో ఊహించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి హవా నడిచింది. ఉద్యమ నేపధ్యంలో రాజినామా చేసిన స్థానాలను కొంచెం మెజారిటీ తగ్గినప్పటికీ విజయవంతంగా దక్కించుకోగలిగింది. ఉప ఎన్నికలు జరిగిన తెలంగాణలోని ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకోగా,  ఐదవ  స్థానంలో తెరాస బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన బిజెపి అనూహ్యంగా మహబూబ్‌నగర్‌లో  విజయం సాధించింది. ఉప ఎన్నిక జరిగిన మరో స్థానం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఘోర ఓటమి చవి చూశాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఆయన కాంగ్రెసు అభ్యర్థిపై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ డిపాజిట్ గల్లంతయింది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి టి రాజయ్య 32 వేల భారీ ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి కడియం శ్రీహరిపై విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెసు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. తెలంగాణవాదం బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా తెరాస విజయం సాధించింది. కొల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెసు, తెలుగుదేశం రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మంత్రి డికె అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినప్పటికీ జూపల్లి కృష్ణారావు విజయాన్ని అడ్డుకోలేకపోయారు. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. ఇక మహబూబ్‌నగర్‌లో తొలుత కాంగ్రెసు అభ్యర్థి ముత్యాల ప్రకాష్ ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో  తెరాస అభ్యర్థి ఇబ్రహీం నాలుగో స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకారు. అయితే ఆఖరు రౌండ్‌లో బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి అనూహ్యంగా స్వల్ప మెజారిటీతో సంచలన విజయం సాధించారు.   కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితమైంది.
ముఖ్యమంత్రి నైరాశ్యం
ఉప ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిఅన్నార్. రాజకీయంగా సమర్థవంతంగా పని చేయలేక పోయామని  అన్నారు. కాంగ్రెసు పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేక పోయామన్నారు. అద్భుతాల సృష్టికి తన వద్ద ఎలాంటి అద్భుత దీపం లేదన్నారు. కాంగ్రెసు ఓటమికి అందరిదీ బాధ్యతేనని, ముఖ్యమంత్రిగా తన కూడా బాధ్యత కూడా ఉందని అన్నారు. కోవూరులో మొదటి నుండి కాంగ్రెసు పార్టీ పైన వ్యతిరేకత ఉందన్నారు. ఫలితాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.  పని తీరు మెరుగుపర్చుకుంటామని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతోందని,  పరిష్కారం  కేంద్రం చేతిలోనే  ఉందని చెప్పారు. ఓటమికి విద్యుత్ కొరత కూడా ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫలితాలను సమీక్షిస్తాం: బాబు
 ఎన్నికల ఫలితాలను తాము సమీక్షించుకుని, ముందుకు పోవడానికి ఏం చేయాలో ఆలోచన చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు చెప్పారు. . తెలంగాణ విషయంలో తమది పరిమితమైన పాత్ర అని,  సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెసు పార్టీ,, కేంద్ర ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. అనవసరంగా తమపై తెలంగాణ విషయంలో నిందలు వేస్తున్నారని ప్రజలకు చెప్పామని, తమ వాదనను తెలంగాణ ప్రజలు కొంత మేరకు విశ్వసించారని ఆయన అన్నారు. తెలంగాణకు తాము అన్యాయం చేయలేదని, తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పగలిగామని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులను లాక్కుని ఉప ఎన్నికలు తెచ్చారని ఆయన విమర్శించారు.
విశ్వసనీయతకు పట్టం: జగన్
విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవూరు ఫలితంపై అన్నారు. కోవూరులో తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన స్పందించారు నీతిమాలిన రాజకీయాలకు వ్యతిరేకంగానే కోవూరు ఉప ఎన్నిక ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...