Saturday, August 20, 2011

అసలు ఎవరీ అన్నా హజారే...?

అన్నా హజారే (జనవరి 15 ,1940) గా సుప్రసిద్ధుడయిన కిసాన్ బాబూరావ్ హజారే , ఒక భారతీయ సామాజిక కార్యకర్త, భారతదేశం లోని మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగాన్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందారు, దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి  చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 1990 లొ పద్మశ్రీ అవార్డు తోనూ, 1992లో  పద్మ భూషణ్ అవార్డుతో ను భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నా, భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. తండ్రి బాబూరావ్ హజారే ఒక  కార్మికుడు, ఆయన  తాత సైన్యంలో పనిచేశారు.  తాత ఉద్యోగ రీత్యా   బాబూరావు, కుటుంబం భింగర్‌కు వెళ్లిపోయింది, ఇక్కడే అన్నా పుట్టాడు. అన్నా తాత 1945లో చనిపోయారు కాని కుటుంబం మాత్రం భింగర్‌లోనే 1952వరకు ఉండిపోయింది, తర్వాత అన్నా తండ్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాలేగాన్ సిద్ధికి వెళ్లిపోయారు. అన్నా నాలుగో తరగతి వరకు చదువు పూర్తి చేశాడు, ఆయనకు  ఆరుగురు సోదరులు . కుటుంబం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. బాబూరావ్ చెల్లెలికి పిల్లలు లేరు, ఈమె అన్నా సంరక్షణ బాధ్యత చేపట్టి  ముంబై తీసుకుపోయింది.  ముంబైలో ఉంటూ 7వ తరగతి పూర్తి చేసిన అన్నా ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వచ్చింది. అన్నా ముంబైలోని దాదర్‌లో ఒక పూల వ్యాపారి వద్ద పనిచేస్తూ నెలకు నలభై రూపాయలు సంపాదించేవాడు.  క్రమంగా తన స్వంత పూల షాపును ప్రారంభించాడు. ఇతడి సోదరులలో ఇద్దరు కూడా  తర్వాత అన్నా వ్యాపారంలో కలిశారు.

క్రమంగా  చెడు సహవాసాలలో కూరుకుపోయి తన సమయాన్ని, డబ్బును మానసిక బలహీనతలపై వృధా చేయడం ప్రారంభించాడు. చివరకు  వీధిపోరాటాలు, కుమ్ములాటలలో కూడా తలదూర్చాడు.  ప్రత్యేకించి గూండాలు మామూలు వ్యక్తిని వేధించడం చూస్తే చాలు, అన్నా వారితో పోరుకు సిద్ధమయ్యేవాడు. అలాంటి ఒక పోరులో అన్నా ఒక వ్యక్తిని ఘోరంగా బాదేశాడు. తనను అరెస్టు చేస్తారనే భయంతో, అతడు రోజువారీ పనిలోకి సక్రమంగా రావడం, ఇంటికి రావడం కూడా మానేశాడు. ఈ కాలంలోనే (ఏప్రిల్ 1960)  సైనిక రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు చివరకు భారతీయ సైన్యంలోకి ఎంపికయ్యాడు.  మొదటి శిక్షణలో, అతడిని ఔరంగాబాద్ పంపించారు. శిక్షణ తర్వాత  పంజాబ్‌లో ఒక ట్రక్కు డ్రైవర్‌గా నియమించబడ్డాడు. ఇంటికి చాలా దూరంలో ఉంటూ, నిరాశా నిస్పృహల బారిన పడ్డాడు, జీవితానికి అర్థంలేకుండా పోతోందనే భావంతో ఒక దశలో తన జీవితాన్ని ముగించుకోవాలని కూడా  నిర్ణయించుకుని ఆత్మహత్య పత్రం కూడా రాశాడు. అయితే, మరింత తెలివితో అతడు తన ఆత్మహత్య, చిన్నారి చెల్లెలు వివాహ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని గుర్తించాడు. అందుచేత, తన సోదరి వివాహం పూర్తయేంతవరకు తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవాలని  నిర్ణయించుకున్నాడు. ఈలోగా, కొన్ని సంఘటనలు తన జీవితానికి కొత్త మార్గాన్ని ఇచ్చాయి. 1965 ఇండో-పాక్ యుద్ధకాలంలో, పశ్చిమ ప్రాంతంలో ఒకచోట సైనిక వాహనాన్ని నడుపుతున్నప్పుడు తమ నెత్తిమీద పాకిస్తాన్  విమానం ఎగురుతుండటం చూశాడు. తాను, తన సహోద్యోగులు వెంటనే వాహనం మీదనుంచి దూకి సమీపంలోని పొదలలో దాక్కుని భూమికి సమాతరంగా పడుకుండిపోయారు. ట్రక్కు పేల్చివేయబడి తన స్నేహితులందరూ చంపబడ్డారు కాని అన్నా మాత్రం గాయపడకుండా తప్పించుకున్నాడు.

ప్రజలలో నైతిక బాధ్యతను పెంచడానికి  గాంధీవాద పద్ధతులను అన్నా ఉపయోగించాడు. రాలేగాన్ సిద్ధిలో ఉన్నత పాఠశాల ప్రారంభించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు అనుమతి మంజూరు చేయడానికి సిద్ధపడలేదు. దీంతో అన్నా, జిల్లా పరిషత్ కార్యాలయం వెలుపల నిరాహార దీక్షను ప్ర్రారంబించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు వందలాదిగా కదిలి ఆయన చెంత చేరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్‌కు తలొగ్గవలసి వచ్చింది.  భారతీయ సైన్యంలో  1975లో స్వచ్ఛంద విరమణ చేసి తన స్వంత గ్రామం ఉన్నతి కోసం  తిరిగి వచ్చాడు, తన రూ.20,000 భవిష్యనిధితో అన్నా ఊరిలోని ఆలయ పునరుద్ధరణను ప్రారంభించాడు. రాలేగాన్ సిద్ధిలోని జనాభాలో అత్యధిక భాగం ఇప్పటికీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటోంది. మంచి సాగునీటి వ్యవస్థను నిర్మించడం ద్వారానే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం వీలవుతుందని అన్నా గుర్తించాడు. కొండ దిగువ ప్రాంతంలో ఉన్న రాలెగాన్ భౌగోళిక స్థానాన్ని పరిగణనలోకి తీసుకున్న అన్నా హజారే నీటిని అడ్డగించి మళ్లీ ప్రవహించేలా చేసి భూగర్భ జలాలను పెంచడం కోసం వాటర్‌షెడ్ గట్టును నిర్మించాలని గ్రామస్తులను ఒప్పించాడు. స్వచ్ఛంద కృషి ద్వారా నిర్మించిన తొలి నీటిగట్టుకు చిల్లుపడగా ప్రభుత్వ నిధితో దాన్ని పునర్నర్మించారు. రెండవ పెద్ద సమస్య అయిన నేల కోతను నివారించేందుకోసం కూడా అన్నా చర్యలు చేపట్టాడు. వృధాగా వెళుతున్న నీటిని తనిఖీ చేయడం ద్వారా నేల మరియు నీటిని ఆదా చేయడానికి, కొండవాగుల పొడవునా నిమ్నోన్నత కాలువలను, వాగు గసికలను నిర్మించాడు. కొండవాలు మరియు గ్రామం పొడవునా పచ్చిక, పొదలు మరియు 3 లక్షల చెట్లను నాటించాడు. ఈ ప్రక్రియకు అనుబంధంగా అటవీకరణ, నీటి మడుగులు, భూగర్భ చెక్ డ్యామ్‌లు మరియు సిమెంట్ చప్టాలను కీలక ప్రాంతాల్లో నిర్మించారు. వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు భారీ విజయాన్ని సాధించాయి, రాలెగాన్ సిద్ధి గ్రామం ఇవ్వాళ రూ.80 లక్షల విలువైన ఉల్లిపాయలను ఎగుమతి చేస్తోంది. గ్రామంలోని చాలా మంది వ్యవసాయదారులు గోధుమ ఉత్పత్తిని పెంచినందువల్ల, గ్రామ సభలో ఒక నిర్ణయం తీసుకున్నారు, దీని ప్రకారం అదనపు గోధుమ పంట కలిగిన రైతులు 1983లో ప్రారంభమైన ధాన్య బ్యాంకుకు స్వచ్ఛందంగా ధాన్యం విరాళం ఇవ్వాలి. తగినంత ధాన్యం లేని గ్రామస్తులు ఈ బ్యాంకునుంచి ధాన్యాన్ని "అప్పు"గా తీసుకోవచ్చు. ఆహార అవసరాల కోసం ఏ గ్రామస్తుడూ డబ్బు అప్పుగా తీసుకోకుండా చెయ్యడమే దీని ఉద్దేశం. ధాన్య బ్యాంకు నుంచి ధాన్యాన్ని రుణరూపంలో ఇస్తారు, దీన్ని యువ బృందాలు పర్యవేక్షిస్తాయి. సామాజిక, ఆర్థిక మార్పు వైపుగా తదుపరి దశలో భాగంగా అన్నా హజారే, యువ బృందం మద్యపాన సమస్యను చేపట్టాలని నిర్ణయించారు. దీంతో దాదాపు ముప్పై సారా తయారీ కేంద్రాలను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. సామాజిక ఒత్తిడికి తలొగ్గని వారిని తమ వ్యాపారం మూసుకునేలా ఒత్తిడి చేసి, యువ బృందం వారి సారా బట్టీలను కూల్చివేశారు. ప్రత్యామ్నాయ వృత్తిగా, రాలెగాన్‌లో పాల ఉత్పత్తిని ప్రోత్సహించారు.  రాలెగాన్ సిద్ధిలో అన్నా హజారే రాలెగాన్ యువతతో కలిసి అక్షరాస్యతా రేటు, విద్యా స్థాయిలను పెంచడానికి కృషి చేశారు. 1976లో వారు ప్రాధమిక స్కూలుకు ముందటి ప్రీ స్కూల్‌ను ప్రారంభించారు, 1979లో ఉన్నత పాఠశాలను కూడా ప్రారంభించారు.  

ఈరోజు అన్నా ఒక మహర్షి స్థాయిని పొందారు. గ్రామంలోని తన భూమిని ఆయన హాస్టల్ భవంతికి విరాళంగా ఇచ్చారు. తన ఫించన్ డబ్బులను గ్రామ నిధికి ఇచ్చేవారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన అన్నా కొద్దిపాటి వ్యక్తిగత వస్తువులతో గ్రామ ఆలయంలో నివసిస్తున్నారు. ఆయన హాస్టల్ అబ్బాయిలకు వండిపెట్టే సాధారణ భోజనాన్ని స్వీకరిస్తుంటారు. ఆయన తల్లిదండ్రులు, సోదరులు కూడా గ్రామంలోనే నివసిస్తుంటారు కాని గ్రామంలోని ఏ ఇతర కుటుంబం కంటే వారు భిన్నంగా ఉండరు. పరమ నిస్వార్థ జీవితం నుంచి పెంపొందుతూ వచ్చిన నైతిక అధికారం ఆయన్ను గ్రామంలో తిరుగులేని నేతగా మార్చింది. ఇప్పుడు రాచ పుండు లాంటి అవినీతిపై ఏకంగా జాతీయ స్థాయి లో ఉద్యమం చేపట్టిన అన్నా ఎంతవరకు సఫలీకృతుడవుతారో చూడాలి. 















.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...