Tuesday, November 9, 2010

రోశయ్య, చంద్రబాబు మధ్య మళ్ళీ మాటల తూటాలు

హైదరాబాద్,నవంబర్ 9 రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. ఇరువురు నాయకులు తీవ్రస్థాయిలో పరస్పర ఆరో పణలు చేసుకున్నారు. జల్‌ తుపాన్‌ వల్ల రాష్ట్రానికి ఇంత విపత్తు జరిగితే సోనియా, మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌గాంధీ ఎందుకు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు నేలపై ఉంటే ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తిరిగి సరి పుచ్చుకుంటున్నారన్నారు. సోనియా భజన చేస్తున్న ఎంపీలు చేతకాని, దద్దమ్మలని విరుచుకుపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారన్నారు. సీఎం రిటైల్‌గా దోచుకుంటున్నారని, రోజువారీ ఖజానా నింపుకోవడమే పనిగాపెట్టుకున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందని, వైఎస్‌ మృతితో రోశయ్యకు సీఎం పదవి బంపర్‌ ఆఫర్‌లా తగిలిందని ఎద్దేవా చేశారు. వరద బాధితులను ఆదుకోవడం చేతకాకపోతే రాజీనామా చేయాలని రోశ య్యకు సలహా ఇచ్చారు. ‘ఇది రాక్షస ప్రభు త్వం. జుట్టు పట్టుకుని అడుగుదా మనుకుంటే రోశయ్య నెత్తిపై జుట్టుకూడా లేదు. ఈ సర్కారు ఎద్దులబండిలా ఉంది. కొడితే కొంతదూరం కదులుతుంది. తోకమెలిస్తే మరికొంత దూరం పరిగెడుతుంద’ని రోశయ్య సర్కారుపై బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత విమర్శలపై ముఖ్యమంత్రి రోశయ్య తీవ్రస్థాయిలోనే ఎదురుదాడి చేశారు. ఆయన గత ఏడాదిన్నర కాలంలో ఈ స్థాయిలో బాబుపై విమర్శలు చేయటం ఇదే తొలిసారి. ‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీవు నిక్కర్లు కూడా వేసుకోలేదు. స్థాయిని మరిచి మాట్లాడకు. నీది రాక్షస మనస్తత్వం. నీ అంత రాక్షసమనస్తత్వం ఉన్న సీఎంలు ఎవరూ లేరు. పిల్లనిచ్చిన మామను హత్య చేశావు. నీవే ముఠాలు కట్టి వైశ్రాయ్‌ హోటల్‌లో ఎమ్మెల్యేలను కట్టేసి, ఎన్టీఆర్‌ వచ్చినా మాట్లాడకుండా నిర్దాక్షిణ్యంగా చెప్పులేయించావు’ అని బాబుపై విరుచుకుపడ్డారు. మామపైనే పోటీ చేస్తానంటే ఇందిరాగాంధీ అది మంచిదికాదని ఏదో ఒక చోట టికెట్‌ ఇవ్వమంది. ఓడిన ఆరునెలల్లోనే మామ పంచన చేరాడని విరుచుకుపడ్డారు. ‘గతంలో ఔరంగజేబు ఈరకంగా వ్యవహరిస్తే వందేళ్ల తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడే మళ్లీ ఆ మాదిరిగా వ్యవహరించాడ’ని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ ఇద్దరి ఆస్తులపై న్యాయవిచారణ చేయిద్దామంటే అందుకు తాను సిద్ధమన్నారు. అయితే నీవు మళ్లీ హైకోర్టుకో, సుప్రీంకోర్టుకో వెళ్లి స్టే తెచ్చుకోకూడదని బాబును ఎద్దేవా చేశారు.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...