Thursday, June 25, 2015

మూడు ప్రతిష్టాత్మక పథకాలకు ప్రధాన మంత్రి శ్రీకారం

న్యూఢిల్లీ, జూన్‌ 25 : మూడు ప్రతిష్టాత్మక పథకాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. గురువారం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 100 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేసేందుకు 'స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌' పథకం, దేశంలోని 500 నగరాల్లో మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు అటల్‌ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవనం 'అమృత్‌' పథకం, 2020 నాటికి నగరాల్లో ఉండే అందరికీ ఇళ్లు లక్ష్యంతో ప్రధానమంత్రి 'ఆవాస్‌యోజన' పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రూ.48 వేల కోట్లతో 100 స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో స్మార్ట్‌ సిటీకి ఏడాదికి రూ. 100 కోట్ల చొప్పున ఐదేళ్ల వరకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. మరోవైపు తెలుగు రాష్ర్టాల్లో 5 స్మార్ట్‌సిటీలు, 46 అమృత్‌ పట్టణాలను కేంద్రం ఆధునీకరించనుంది. ఏపీలో 3, తెలంగాణలో 2 స్మార్ట్‌సిటీలు ఎంపికవగా, ఏపీలో 31, తెలంగాణలో 15 అమృత్‌ పట్టణాలను ఎంపిక చేశారు. ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ,  పట్టణ జీవన విధానంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి మార్పుతేవడమే తమ ప్రభుత్వ ప్రయత్నమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఇంకా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాల్సి ఉందని తెలిపారు. ఈ పథకాల అమలు కోసం ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ర్టాలు, స్థానిక సంస్థలు సమష్టిగా ఈ పథకాలను అమలు చేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు  తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలను కేంద్రం స్మార్ట్ సిటీస్ జాబితాలో చేర్చింది. అమృత్ నగరాల జాబితాలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, ఆదిలాబాద్, కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యాపేట, మిర్యాలగూడ, జగిత్యాల పట్టణాలు ఉన్నాయి.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...