Friday, November 14, 2014

కవిత పై రేవంత్ వ్యాఖ్యలు...అట్టుడికిన టి. అసెంబ్లీ...వారం పాటు దేశం సభ్యుల సస్పెన్షన్

 హైదరాబాద్,  నవంబర్ 14;  నిజామాబాద్‌ ఎంపీ కవితపై తెదేపా నేత రేవంత్‌రెడ్డి చేసిన  వ్యాఖ్యలు శుక్రవారం కూడా తెలంగాణ శాసనసభను కుదిపేశాయి. రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని తెరాస సభ్యులు పట్టుబట్టడం...ప్రతిగా తమ నేతను బడ్జెట్‌పై ప్రసంగించనివ్వాలని సభ మధ్య బైఠాయించిన నేపథ్యంలో శాసనసభ నుంచి తెలుగు దేశం సభ్యులు   వారంరోజుల పాటు సస్పెండ్‌ అయ్యారు. అయినా సభలోనే కూర్చుండిపోయిన వారిని మార్షల్స్‌ వచ్చి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సస్పెండైన వారిలో తెదేపాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఉపనేత రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, రాజేందర్‌రెడ్డి, ఎ.గాంధీ, సాయన్న, సండ్ర వెంకటవీరయ్య, వివేకానంద, గోపీనాథ్‌ ఉన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై మాట్లాడేందుకు రేవంత్‌రెడ్డికి అవకాశమివ్వగా తెరాస సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

గందరగోళం మధ్య సమావేశాన్ని సభాపతి ఎస్‌.మధుసూదనాచారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12.52 గంటల సమయంలో సభ ప్రారంభం కాగా మళ్లీ అదే పరిస్థితి. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రులు సమాధానం చెప్పకుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించగా మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం చెబుతూ ఆ వ్యాఖ్యలని ఖండించారు. ఎన్ని రోజులైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సభను తప్పుదోవపట్టించిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. మళ్లీ గందరగోళం నెలకొనడంతో సభను మరోసారి వాయిదా వేశారు. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో సభ ప్రారంభం కాగానే తెరాస సభ్యులు రేవంత్‌రెడ్డి క్షమాపణకు పట్టుబట్టారు.

మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పదే పదే విజ్ఞప్తి చేసినా సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇష్టం లేకపోయినా తెదేపా సభ్యులు 8 మందిని ఈ వారం సస్పెండ్‌ చేయడానికి ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇంతలో తెదేపా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉప నేత రేవంత్‌రెడ్డి కూడా తమ పార్టీ సభ్యులతో కలసి స్పీకర్‌ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిని కూడా సస్పెండ్‌ చేయాలని మంత్రి ప్రతిపాదించారు. తెదేపా సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానాన్ని సభ ఆమోదించింది. 

రేవంత్ వివరణ...

ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జరిపిన సమగ్ర సర్వేలోని కొన్ని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం  మాత్రమే చేశానని టి.టిడిపి నేత రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా ఎవరిమీదా నిరాధార ఆరోపణలు చేయలేదని అన్నారు. వార్తా, ప్రకటనల రూపంలో వచ్చిన వాటినే చూపించి... ప్రభుత్వాన్ని ప్రశ్నించానని అన్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత రెండో చోట్ల నయోదు చేయించుకున్నారని, దీనిపై అధికారులపై ఏ చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలని మాత్రమే ప్రశ్నించానని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వం 30 గంటల తర్వాత క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే సభలో మాట్లాడాలని... సభను స్తంభింపజేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై స్పీకర్‌ కు, శాసనసభలో ఉన్న మిగతా పక్షాల నాయకులకు లేఖలు రాశానని, జరిగిన సంఘటనలు,  తన వద్ద ఆధారాలను వారికి ఇచ్చినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా టీడీపీ ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసి సభను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న వీడియో క్లిప్పుంగ్‌లను మీడియా ఎదుట రేవంత్‌రెడ్డి బహిరంగపరిచారు. 
సమగ్ర సర్వేలో ఎంపీ కవిత పేరు రెండు చోట్ల నమోదు అయిన మాట వాస్తవమని, కలెక్టర్‌కు పిర్యాదు అందడంతో హైదరాబాద్‌లో  పేరు తొలగించారని అన్నారు. 
 
ఇలా వుండగా, ఎంపీ కవితపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం తెలంగాణ జనజాగృతి కార్యకర్తలు రేవంత్‌ రెడ్డి నివాసంపై దాడికి యత్నించారు. దీనిపై స్పందించిన రేవంత్‌ దాడులతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోనని వెల్లడించారు. కేసీఆర్‌ను నీడలా వెంటాడుతునే ఉంటానని ఆయన అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు పోరాటం చేస్తారని, తెలంగాణలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, హరగోపాల్‌ లాంటి నేతలు కదలాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. నా ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని... నేనేమైనా ఉగ్రవాదినా? అంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...