Sunday, July 22, 2012

దేశ 13 వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఘనవిజయం

న్యూఢిల్లీ,జులై 21:  భారత రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీ ఘనవిజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా నాలుగున్నర దశాబ్దాల పాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగిన ప్రణబ్.. దేశ 13 వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యూపీఏ కూటమి మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రణబ్‌కు ఊహించినట్లే భారీ మెజారిటీ లభించింది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,29,750 విలువగల చెల్లుబాటు ఓట్లలో.. 7,13,763 విలువ గల  ( 69.3 శాతం )ఓట్లను ప్రణబ్ గెలుచుకున్నారు. ఆయన ప్రత్యర్థి, బీజేపీ, ఏఐఏడీఎంకే, బీజేడీ తదితర  ప్రతిపక్ష పార్టీల మద్దతుతో పోటీ చేసిన పి.ఎ.సంగ్మాకు కేవలం 3,15,987 విలువగల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ప్రణబ్ 3,97,776 ఓట్ల విలువ తేడాతో సంగ్మాపై గెలుపొందారు.  ప్రతిపక్ష బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ప్రణబ్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరగటం విశేషం. మొత్తం శాసనసభ్యులు 224 మంది కాగా.. బీజేపీ బలపరిచిన సంగ్మాకు 103 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా.. ప్రణబ్‌కు 117 మంది శాసనసభ్యుల ఓట్లు పోలయ్యాయి. మరో మూడు ఓట్లు చెల్లలేదు. ఒక ఎమ్మెల్యే ఓటు వేయలేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రణబ్‌కు స్పష్టమైన మెజారిటీ లభించింది. బీజేపీ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, గోవాల్లో సంగ్మాకు భారీగా ఓట్లు లభించాయి. బీజేపీ - జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వమున్న జార్ఖండ్‌లో 81 మంది ఎమ్మెల్యేలుండగా.. సంగ్మాకు కేవలం 20 ఓట్లు మాత్రమే దక్కటం విశేషం. జేఎంఎం ప్రణబ్‌కు అనుకూలంగా ఓటు వేయటంతో ఆయనకు 60 ఓట్లు లభించాయి. 294 మంది ఎమ్మెల్యేలున్న ఆంధ్రప్రదేశ్‌లో.. 190 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయగా.. ప్రణబ్‌కు 182 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. వీరిలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన శాసనసభ్యులు ఉన్నారు. సంగ్మాకు ముగ్గురు ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. ఐదు ఓట్లు చెల్లలేదు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. కేరళలో ప్రణబ్ క్లీన్ స్వీప్ చేశారు. పోలైన 124 ఓట్లూ ప్రణబ్‌కే దక్కాయి. ఒక్క ఓటు మాత్రం చెల్లలేదు. సంగ్మాకు ఒక్క ఓటు కూడా పడలేదు. 140 మంది సభ్యులన్న కేరళ అసెంబ్లీలో సీపీఐ, ఆర్‌ఎస్‌పీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. చివరి నిమిషంలో మద్దతు ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్‌తో సహా యూపీఏ భాగస్వామ్య పక్షాలు, యూపీఏకు వెలుపలి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో పాటు.. జేడీ(యూ), శివసేన వంటి పార్టీల మద్దతుతో ప్రణబ్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...