Thursday, March 22, 2012

చెదరని భగవద్గీత...

మాస్కో,మార్చి 22 :  రష్యాలో జరిగిన న్యాయపోరాటంలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత మరోసారి విజయం సాధించింది. గీత రష్యన్ అనువాద ప్రతి తీవ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉందని, దాన్ని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను రష్యా కోర్టు తోసిపుచ్చింది. దీంతో కోర్టు హాల్లో గీత ఆరాధకులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం( ఇస్కాన్) వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అనువదించిన ఆ గీత ప్రతిని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గత డిసెంబరులో కింద కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సైబీరియా ప్రాసిక్యూటర్లు తోమ్క్ నగరంలోని కోర్టులో అప్పీలు చేశారు. గీతను నమ్మని వారి పట్ల పూర్తి విద్వేషాలను రగిల్చేలా ఆ అనువాదం ఉందని వారు ఆరోపించారు. అయితే తోమ్క్‌లోని అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు తీర్పునే సమర్థించిందని, అనువాద ప్రతిలో తీవ్రవాద భావజాలం లేదని పేర్కొందని ఇస్కాన్ మాస్కో విభాగానికి చెందిన సాధు ప్రియా దాస్ తెలిపారు. రష్యా న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రష్యాలో భారత రాయబారి అజయ్ మల్హోత్ర కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ శాఖ కూడా హర్షం వ్యక్తంచేసింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...