Sunday, August 7, 2011

తెలంగాణ రాజకీయ జెఎసికి పోటీగా మరో కమిటీ

కె. చంద్రశేఖర రావు ఏకాధిపత్యానికి తెర వేసే ప్రయత్నాలు !
హైదరాబాద్,అగస్ట్ 8:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఏకాధిపత్యానికి తెర వేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్న కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ రాజకీయ జెఎసికి పోటీగా మరో కమిటీ ఏర్పాటైంది. స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర రావు దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ రాజకీయ జెఎసికి ప్రత్యామ్నాయంగా మరో కమిటీని ఏర్పాటు చేయాలనే తెలుగుదేశం తెలంగాణ ఫోరం ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి. రాష్ట్ర సాధన ఉద్యమ సమన్వయ కమిటీగా దానికి పేరు పెట్టారు. ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ నేతృత్వంలో, ఆ తర్వాత ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నాయకత్వంలో తెలంగాణ రాజకీయ జెఎసికి ప్రత్యామ్నాయంగా మరో కమిటీని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. వారిద్దరు అందుకు అంగీకరించకపోవడంతో కొండా లక్ష్మణ్ బాపూజీతో సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రయత్నాలు సాగించి విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఈ సమావేశానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు, తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెసు మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, సమాంతర పాలన సాగించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇటీవల అన్నారు. దాన్నిబట్టి, రాజీనామాల విషయంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కాగా, కార్యాచరణను ఖరారు చేయడానికి తిరిగి ఈ నెల 19వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...