Saturday, November 6, 2010

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధార్థ శంకర్ రే కన్నుమూత

కోల్‌కతా,నవంబర్ 6: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధార్థ శంకర్ రే శనివారం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన కేంద్రమంత్రిగా, పంజాబ్ గవర్నర్‌గా, అమెరికా రాయబారిగా పనిచేశారు. సిద్ధార్థ శంకర్ రే అరవైయ్యవ దశకంలో కేంద్రంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1972లో బెంగాల్‌లో కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి 1977 వరకూ పనిచేశారు. ఆయన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు.ఆయన సీఎం అయ్యేనాటికి బంగ్లా విముక్తి యుద్ధం ముగిసినా, ఆ యుద్ధం కారణంగా వచ్చిన లక్షలాదిమంది శరణార్ధులతో రాష్ట్రం సతమతమయ్యేది. ఆ సమస్యను ఆయన సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 1967లో నక్సల్బరీ గ్రామంలో మొదలైన రైతాంగ ఉద్యమం ఆయన అధికారం చేపట్టేనాటికి రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోనూ, కాలేజీల్లోనూ వ్యాపించింది. వర్గ శత్రు నిర్మూలన సిద్ధాంతంతో అప్పట్లో చెలరేగిన నక్సలైట్ల హింసాకాండను ఆయన అణచివేశారు. ఈ క్రమంలో నిరాయుధులైన అనేకమంది యువకుల్ని, విద్యార్థుల్ని పోలీసులు కాల్చిచంపారని ఆరోపణలు వచ్చాయి. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి సిద్ధార్థ సలహాయే కారణమని వామపక్షాలు ఆరోపించాయి. 1977లో ఎమర్జెన్సీ ఎత్తేశాక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలై సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...