విజయవాడ, జూన్ 19: రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు ఆందోళనకు గురై ఒక్కసారిగా బయటకు వచ్చారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు పెదకూరపాడు తదితర ప్రాంతాలలో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. కృష్ణా జిల్లాలోని నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, కంచికర్ల, పెనుగంచిప్రోలు, ఖమ్మం జిల్లాలోని మధిర, ఎర్రపాలెం, వైరా బోనకల్, నల్గొండ జిల్లాలోని కోదాడ, మేళ్లచెరువు, హుజుర్ నగర్‌లలో భూమి కంపించింది. అరగంట సమయంలో వివిధ ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించాయి. కాగా, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు