Friday, June 15, 2012

ఓదార్పు దొరికింది...

హైదరాబాద్,జూన్ 15;  ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ 15 గెల్చుకుని సత్తా చాటింది. నర్సన్నపేట, పాయకరావుపేట, పోలవరం, మాచర్ల, పత్తిపాడు, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో వైఎస్సార్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.నెల్లూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూదా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఘన విజయం సాధించారు.కాగా, అధికార కాంగ్రెస్ రెండు స్థానాల్లో-(నర్సాపురం, రామచంద్రాపురం లలో గెలుపొందింది. పరకాల సీటును టీఆర్‌ఎస్ గెల్చుకుంది. తెలుగుదేశం పార్టీ కి ఒక్క స్థానం కూదా దక్కకపోవదం గమనార్హం.    వైఎస్సార్ జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి అత్యధిక మెజారిటీ సాధించారు. ఆయన 56891 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎం. రాంప్రసాదరెడ్డిపై విజయ ఢంకా మోగించారు. శ్రీకాంత్‌రెడ్డికి 90978 ఓట్లు, రాంప్రసాదరెడ్డికి 34087 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం 25344 ఓట్లు దక్కించుకున్నారు. మరోవైపు హోరాహోరీగా సాగిన వరంగల్ జిల్లా పరకాల స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతి 1562 ఓట్ల స్వల్ప మెజారిటీలో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటీ ఇవ్వడంతో ఆయనకు అత్యల్ప మెజారిటీ దక్కింది. నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 291745 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై ఘన విజయం సాధించారు.  తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి 18117 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయనకు 39723 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన చిరంజీవికి 15 వేలు మెజారిటీ మాత్రమే వచ్చింది. 18 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 9 సీట్లలో రెండోస్థానం, మరో 9 నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలిచింది. అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఉదయగిరి, ఒంగోలు, మాచర్ల, పత్తిపాడు, పోలవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. పరకాల, తిరుపతి, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, నర్సాపురం, రామచంద్రాపురం, నర్సన్నపేటల్లో మూడో స్థానానికి పరిమితమయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...