Monday, June 25, 2012

భావోద్వేగంతో ప్రణబ్ కు కాంగ్రెస్ వీడ్కోలు...

న్యూఢిల్లీ,జూన్ 25:  . నాలుగు సుదీర్ఘ దశాబ్దాల పాటు అవసరాల్లోనూ, ఆపద సమయాల్లోనూ నేనున్నానంటూ ఎప్పటికప్పుడు ఆదుకుంటూ వచ్చిన  ప్రణబ్ ముఖర్జీ  (76) కి  కాంగ్రెస్ పార్టీ  ఘనంగా వీడ్కోలు పలికింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ప్రణబ్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సోమవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమై పార్టీకి ప్రణబ్ చేసిన  సేవలను గుర్తు చేసుకుంది.అధినేత్రి సోనియా గాంధీ ఆయనకు స్వయంగా వీడ్కోలు పలికారు. భారీ మెజారిటీతో ప్రథమ పౌరునిగా ఎన్నికవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీలో అత్యంత సీనియర్ సభ్యుడు ఆయనేనంటూ  గుర్తు చేసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యూపీఏ ఆయనను ఎంచుకోవడం అత్యంత హర్షణీయమన్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అనేకానేక బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వర్తిస్తూ వచ్చిన ప్రణబ్ సేవలను ఇకపై కోల్పోతామని ప్రధాని మన్మోహన్‌సింగ్ నిట్టూర్చారు. ఆయన లోటు పూరేది కాదన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీతో పాటు మోతీలాల్ వోరా, ఎస్‌జీ జమీర్, ఆర్‌కే ధావన్, మొహిసినా కిద్వాయ్ వంటి పార్టీ సీనియర్లు ఈ సందర్భంగా మాట్లాడారు. కొండంత అండగా నిలుస్తూ, అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ వచ్చిన ఆయన ఇప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని వీడుతున్నందుకు బాధగానే ఉన్నా.. అత్యున్నత పదవిని చేపడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పార్టీతో దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్న నేపథ్యంలో ప్రణబ్ కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తాను పార్టీకి ఇచ్చిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువే పొందానన్నారు. సీడబ్ల్యూసీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...