రాష్ట్రపతి ఎన్నికల ముఖచిత్రం పై స్పష్టత .....ప్రణబ్ కే పిఠం

న్యూఢిల్లీ,జూన్ 21: రాష్ట్రపతి ఎన్నికల ముఖచిత్రం పై  స్పష్టత వచ్చింది. యూపీఏ కూటమి తరఫున బరిలోకి దిగుతున్న ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పీఠంపై కూర్చునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  ఇప్పటిదాకా తమ అభ్యర్థిపై కొనసాగిస్తున్న సస్పెన్స్కు బీజేపీ గురువారం తెరదించింది. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మాకు మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయంతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన జేడీ(యూ) విభేదించింది. తాము సంగ్మాకు మద్దతు ఇవ్వబోమని, ప్రణబ్ వైపునే నిలుస్తామని స్పష్టం చేసింది. ఎన్డీయేలోని శివసేన ఇప్పటికే ప్రణబ్ కు మద్దతునివ్వగా తాజాగా.. జేడీ(యూ) కూడా అదే బాటలో నడుస్తానని చెప్పి బీజేపీకి షాక్ ఇచ్చింది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో యూపీఏతోపాటు ఎన్డీయేలోనూ చీలిక వచ్చినట్లయింది. ప్రధాన కూటములే కాదు.. అటు లెఫ్ట్ పార్టీల్లోనూ విభజనరేఖలు ప్రస్పుటమయ్యాయి. సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు ప్రణబ్‌కు బాసటగా నిలవగా.. సీపీఐ, రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌పీ)లు తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించాయి. ప్రణబ్ అభ్యర్థిత్వంతో విభేదించిన యూపీఏలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తన మద్దతుపై ఇంకా సస్పెన్స్ కొసాగిస్తూనే ఉంది.  కాగా,  రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తాము భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నా.. కూటమి అస్థిత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోదని బీజేపీ, జేడీయూ స్పష్టం చేయడం గమనార్హం.
రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10.98 లక్షలు. ఇందులో రాష్ట్రపతి పీఠం కైవసం చేసుకోవడానికి కావాల్సిన ఓట్ల విలువ 5,49,442. అయితే యూపీఏ (తృణమూల్ మినహా), సమాజ్‌వాది, బహుజన్ సమాజ్‌వాది పార్టీ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, జేడీ(యూ), శివసేన, జేడీఎస్‌ల మద్దతుతో ప్రణబ్‌కు 6.29 లక్షల విలువైన ఓట్లు వస్తాయి. పీఏ సంగ్మా ఈ అంకెల రేసులో చాలా వెనకబడ్డారు. ప్రణబ్‌కు వచ్చే ఓట్ల విలువలో సగమైనా దక్కే అవకాశాలు కన్పించడం లేదు. ఎన్డీయే (జేడీయూ, శివసేన మినహా), అన్నా డీఎంకే, బీజేడీలు ఆయనకు అనుకూలంగా ఓటేసినా 3.10 లక్షల ఓట్లకు మించవు. ఒకవేళ 45,925 ఓట్లున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా సంగ్మాకు మద్దతు పలికినా విజయం దరిదాపుల్లోకి చేరే అవకాశాల్లేవు. క్రాస్ ఓటింగ్‌పై నమ్మకం పెట్టుకున్నా.. అంత పెద్ద ఎత్తున ఓట్లు క్రాస్ అయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎన్డీయే కూటమికి వాస్తవానికి 3.04 లక్షల విలువైన ఓట్ల బలం ఉంది. అయితే జేడీ(యూ) ప్రణబ్ వైపున నిలవడంతో అది 2.43 లక్షలకు పడిపోయింది. వచ్చేనెల 19న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 776 ఎంపీలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు చెందిన 4,120 ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు