Thursday, March 22, 2012

కిరణ్ కు బిగుస్తున్న అసమ్మతి ఉచ్చు...?

హైదరాబాద్ ,మార్చి 22:  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. తన రాజీనామా లేఖను ఆయన కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. ఉప ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ  రాజీనామా సమర్పిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వైఖరిపై ఆయన తన లేఖలో తీవ్రంగా ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మార్పునకు నాంది పలకాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రికెట్‌తో పోల్చడం దురదృష్టకరమని డిఎల్ సోనియాకు రాసిన లేఖలో అన్నారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడానికి పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అధికారమే పరమావధి కాకూడదని, దిగజారిపోతున్న పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆలోచన చేయాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి ఇదే పరిస్థితి ఉందని, యువ శానసశభ్యులు అంతర్మథనంలో ఉన్నారని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు తాను మంత్రి పదవి ఏనాడూ అడగలేదని, అధిష్ఠానమే అవకాశం కల్పించిందని ఆయన అన్నారు. తాను ఒంటరిగానే పోరాడుతానని ఆయన చెప్పారు. తాను సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరానని, అపాయింట్‌మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తానని ఆయన చెప్పారు.
కాగా, ఏడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఆసరా చేసుకుని కాంగ్రెసులోని అసమ్మతి నాయకులు నాయకులు ఒక్కసారిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై దాడికి దిగుతున్నారు.   వచ్చే 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలను చూపి కిరణ్ కుమార్ రెడ్డిని దించేలా కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తేవడమే అసమ్మతి నాయకుల ఉద్దేశంగా కనిపిస్తోంది. రానున్న 18 స్థానాల ఉప ఎన్నికలను ఎదుర్కునే సమర్థత కిరణ్ కుమార్ రెడ్డికి లేదనే సంకేతాలను పార్టీ అధిష్టానానికి బలంగా పంపించడమే అసమ్మతి వర్గం ఆలోచనగా చెబుతున్నారు.గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రిపై విమర్శలు సంధించడంతో ప్రారంభమై కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి కొనసాగుతోంది. కాగా, మాజీ మంత్రి పి. శంకరరావు సరేసరి. ఒక్కసారిగా ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిపైనే కాకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావు వైయస్ రాజశేఖర రెడ్డితో పోలుస్తూ కిరణ్ కుమార్ రెడ్డిపై వాగ్బాణాలు సంధించారు.  ఈ పథకరచనలో భాగంగానే గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ డిఎల్ రవీంద్రా రెడ్డితో సమావేశమైనట్లు చెబుతున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...