Posts

షిర్డీ సాయి కానుకల వేలం

షిర్డీ, అక్టోబర్ 14: షిర్డీ సాయిబాబా ఆలయానికి భక్తులు సమర్పించిన విలువైన కానుకలను  ఈ నెల 18 నుంచి వేలం వేయనున్నట్టు  శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ తెలిపింది. వీటిలో వెండి, బంగారు, రత్నాలు, వజ్రాలు, ఖరీదైన రాళ్లతో తయారైన కిరీటాలు, హారాలు, పాదుకలు తదితర వస్తువులున్నాయి. మొత్తం 32 కేజీల వెండి, 18 కేజీల బంగారు కానుకలు, 52 విలువైన రత్నాలు, వజ్రాలను వేలం వేయనున్నట్లు  ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు. 18న వెండి, వచ్చే నెల 1న బంగారు, 8న విలువైన రాళ్లను వేలం వేస్తామన్నారు. ఇందులో పాల్గొనే వారు రూ.10 వేల రీఫండబుల్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది .  సాయి కి వచ్చిన కానుకలను కొనుక్కోవడానికి భక్తులు మొగ్గచూపడంతో వాటిని  కరిగించకుండా వేలం వేస్తున్నారు.

లోక్‌సభ ఉపఎన్నికలో ప్రణబ్ తనయుని గెలుపు

Image
కోల్ కతా, అక్టోబర్ 13:  పశ్చిమ బెంగాల్ లోని జంగీపూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ స్వల్ప మైజార్టీతో గెలుపొందారు. సమీప సీపీఎం అభ్యర్థి ముజాఫర్ హుస్సేన్ పై 2,536 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అభిజిత్ కు 3,32,919 ఓట్లు రాగా, హుస్సేన్ కు 3,30,383 ఓట్లు వచ్చాయి. 2009లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీ 1.28 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

2011 నంది అవార్డులు : ఉత్తమ నటుడు మహేష్ బాబు...ఉత్తమ నటి నయనతార

Image
హైదరాబాద్, అక్టోబర్ 13:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులను శనివారం ప్రకటించారు. 2011 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా మహేష్ బాబు(దూకుడు) ఎంపిక కాగా, ఉత్తమ నటిగా నయనతార (శ్రీరామ రాజ్యం), ఉత్తమ చిత్రంగా శ్రీరామ రాజ్యం ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్ (జైబోలో తెలంగాణ) ఎంపికయ్యారు. ఇతర అవార్డుల వివరాలు:  ఉత్తమ విలన్ : మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు), ఉత్తమ ద్వితీయ చిత్రం : రాజన్న, ఉత్తమ తృతీయ చిత్రం : విరోధి, ఉత్తమ గాయకుడు : గద్దర్ (జై బోలో తెలగాణ చిత్రంలోని పొడుస్తున్న పొద్దుమీద ), ఉత్తమ గాయని: మాళవిక (రాజన్న), ఉత్తమ సంగీత దర్శకుడు : ఇళయరాజా (శ్రీరామ రాజ్యం),   ఉత్తమ కుటుంబ కథాచిత్రం : 100% లవ్, ఉత్తమ హాస్య నటుడు : ఎంఎస్ నారాయణ(దూకుడు), ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (దూకుడు), ఉత్తమ పిల్లల చిత్రం : శిఖరం, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : అవయవదానం, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : సమ్మెట గాంధీ(రాజన్న), ఉత్తమ సహాయనటి : రత్నసాగరి(కారాలు మిర్యాలు), ఉత్తమ బాల నటుడు : నికిల్ (100% లవ్), ఉత్తమ బాల నటి : బేబి ఆని(రాజన్న), ఉత్తమ మాటల రచయిత : న...

ఐపీఎల్‌లో స్థానం కోల్పోయిన డెక్కన్ చార్జర్స్

ముంబయి,అక్టోబర్ 12: ఐపీఎల్‌ లో డెక్కన్ చార్జర్స్ స్థానం కోల్పోయింది. ముంబయి హైకోర్టు ముందు రు. 100 కోట్లు బ్యాంకు గ్యారంటీని గడువులోగా చెల్లించనందున డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్ ను  రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గతంలో డెక్కన్ చార్జర్స్ కాంట్రాక్టును రద్దు చేస్తూ బీసీసీఐ ప్రకటించడంతో ప్రాంచైజీ యాజమాన్యం డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమకు అక్టోబర్ 15 వరకూ గడువు కావాలని డెక్కన్ ప్రాంచైజీ కోరడంతో న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులోగా డెక్కన్ డెక్కన్ చార్జర్స్ బ్యాంకు గ్యారంటీని చెల్లించకపోవడంతో తదుపరి ఐపీఎల్‌లో స్థానం కోల్పోయింది.

తెలంగాణపై షిండే మాటకే అజాద్ ఓటు...

హైదరాబాద్, అక్టోబర్ 12:  తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.  తెలంగాణ చాలా జఠిలమైన అంశమని  ఆయన అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతోనే గాక, అందరితోనూ చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీకి ఎవరు వచ్చినా మాట్లాడుతామని ఆయన అన్నారు. మంత్రులు, శానససభ్యులతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై రెండేళ్ల నుంచి చర్చలు జరుపుతున్నామని , ఏకాభిప్రాయ సాధన  వరకు నిర్ణయం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఎవరికి వారు వాదనలు వినిపిస్తున్నారు గానీ ఏకాభిప్రాయం రావడం లేదని ఆయన అన్నారు.ఎంపి, బీహార్, యుపి విభజన మాదిరిగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదని అన్నారు. కాగా, తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని, ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమని కేంద్ర హోం మంత్రి షిండే రెండు రోజుల క్...

మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్టులు

హైదరాబాద్, అక్టోబర్ 11:  రాష్ట్రంలో మరో రెండు మినీ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. కరీంనగర్, భీమవరంలలో 4 నెలల్లోనే వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆధార్‌కార్డు అమలులోకి వస్తే పాస్‌పోర్టు జారీ ప్రక్రియ మరింత సులభతరమవుతుందని చెప్పారు. స్థానిక పోలీసు విచారణలో జాప్యం కారణంగానే పాస్‌పోర్టు జారీ ఆలస్యమవుతోందని తెలిపారు. తత్కాల్ కింద కేవలం మూడు రోజుల్లోనే పాస్‌పోర్టు జారీ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పాస్‌పోర్టు కోసం ఏజెన్సీలను సంప్రదించి మోసపోవద్దని దరఖాస్తుదారులకు శ్రీకర్‌రెడ్డి సూచించారు. ఏజెన్సీలు నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలు చేసి పాస్‌పోర్టులు అందజేస్తున్నాయని, ఈ విషయం విచారణలో బయటపడితే దరఖాస్తుదారులే ఇబ్బంది పడతారని హెచ్చరించారు.
Image
70వ బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులతో అమితాబ్...  

'తెహల్కా' బంగారు కు బెయిల్...

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: తెహల్కా కేసులో నిందితుడైన భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, దళిత నేత బంగారు లక్ష్మణ్‌ కు ఢిల్లీ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.  ఆయనకు రూ.50వేల పూచికత్తుతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆయుధ డీలర్ల నుంచి లక్ష రూపాయిలు లంచం తీసుకుంటూ తెహల్కా డాట్ కామ్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో బంగారు లక్ష్మణ్ పట్టుబడిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ నుంచి బంగారు లక్ష్మణ్ జైలులో ఉన్నారు.

వై.ఎస్. ఫ్యామిలీ మరో ప్రజా ప్రస్థానం...18 నుంచి షర్మిల పాదయాత్ర...

Image
హైదరాబాద్, అక్టోబర్ 11: : రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తన కూతురు  షర్మిల పాదయాత్ర చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తెలిపారు. షర్మిల పాదయాత్రను ప్రారంభిస్తుందని, తరువాత జగన్ బెయల్ పై విడుదలయి వస్తే ఆయన పాదయాత్రను కొనసాగిస్తారని  విజయమ్మ చెప్పారు. ఈ పాదయాత్రను జగన్ చేపట్టాలనుకున్నారని కానీ, ఆయన జైలుకు వెళ్లడంతో షర్మిల చేపట్టేందుకు సిద్ధపడిందని చెప్పారు. తన ఆరోగ్యం దృష్ట్యా తనను వద్దని పార్టీలోని పెద్దలు సూచించారన్నారు. జగన్ స్థానంలో ఎవరో ఒకరు పాదయాత్ర చేయాలని చర్చించుకుంటున్న సమయంలో షర్మిల అందుకు సిద్ధపడ్డారన్నారు. పాదయాత్ర మధ్యలో తాను, జగన్ సతీమణి భారతి రెడ్డి అప్పుడప్పుడు పాలు పంచుకుంటామన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు. అందుకే ఆయన ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో యాత్ర చేస్తారన్నారు.  తెలంగాణ జిల్లాల్లో కూడా యాత్ర ఉంటుందని చెప్పారు. చంద్రబాబు యాత్రకు తమ యాత్రకు తేడా ఉంటుందన్నారు. ఆయనపై ప్రజలకు విశ్వాసం లేదని, కా...

తెలంగాణ పరిష్కారం ఎప్పుడో చెప్పలేం : షిండే

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తాము తెలంగాణ అంశంపై చర్చించ లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే  స్పష్టం చేశారు.  తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోమని షిండే స్పష్టం చేశారు. కెసిఆర్‌తో తెలంగాణ అంశంపై  తాను ఎలాంటి చర్చలు జరపలేదన్నారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోందని చెప్పారు. కేంద్రం ప్రక్రియను కొనసాగిస్తోందని,  అయితే ఈ సమస్యపై పరిష్కారం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమన్నారు.  తెలంగాణ రాదని తేలిపోయింది:  లగడపాటి కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనతో తెలంగాణ రాదని తేలిపోయిందని ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని అన్నారు. 

ముందంజలో మిట్ రోమ్నీ

వాషింగ్టన్,అక్టోబర్ 9:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగమైన తొలి బహిరంగ చర్చలో అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ముందంజలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ తాజా సర్వేలోనూ దూసుకుపోయారు. ఒబామాకు 45 శాతం మంది మద్దతు పలకగా, రోమ్నీకి 49 శాతం మంది మద్దతు పలికారు. అక్టోబర్ 3న జరిగిన చర్చ అనంతరం ఈ సర్వేను నిర్వహించారు. అంతకుముందు జరిపిన సర్వేల్లో వెనుకబడి ఉన్న రోమ్నీ చర్చ తర్వాత ముందుకు దూసుకొచ్చారు. 

కొత్తగ్యాస్ కనెక్షన్ల డిపాజిట్ పెంపు

హైదరాబాద్,అక్టోబర్ 9:  కొత్త గ్యాస్  కనెక్షన్లకు డిపాజిట్ పెంచుతూ చమురు కంపెనీలు మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు సింగిల్ సిలిండర్ కనెక్షన్‌కు రూ.1,250తో పాటు రెగ్యులేటర్ చార్జీ కింద రూ.150 వసూలు చేస్తుండగా,  తాజాగా సింగిల్ సిలిండర్ డిపాజిట్‌ను రూ. 1,450కు పెంచారు. రెగ్యులేటర్‌తో కలిపితే ఇది రూ.1,600 అవుతుంది. రెండో సిలిండర్ తీసుకోవాలంటే మరో రూ.1,450 చెల్లించాలని గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మూడేళ్లక్రితం సిలిం డర్ డిపాజిట్ రూ.900 ఉండేది. దాన్ని తర్వాత రూ. 1,250కు పెంచారు. ఇప్పుడిది రూ.1,450 అయ్యింది. 

ఎంబీఏ, ఎంసీఏ ఫీజుల పెంపు... 12 నుంచి కౌన్సిలింగ్‌

హైదరాబాద్,అక్టోబర్ 9:  రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులను  భారీగా పెంచారు.. రెండు కోర్సులలో కనీస ఫీజుని 27 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసీఏ గరిష్ట ఫీజు 88 వేల రూపాయలు, ఎంబీఏ గరిష్ట ఫీజు 71వేల రూపాయలకు పెంచారు. మొత్తం 48 ఎంబీఏ కాలేజీల్లో, 36 ఎంసీఏ కాలేజీలకు  ఫీజుల పెంపు వర్తిస్తుంది. ఈ నెల 12 నుంచి రెండు కోర్సులకు ఆన్‌లైన్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు.

వరల్డ్ టీ-20 జట్టులో కోహ్లీ, రైనా

కొలంబో, అక్టోబర్ 8:    వరల్డ్  టీ-20 జట్టును ఐసీసీ ప్రకటించింది. కెప్టెన్‌గా జయవర్ధనేను ఎంపిక చేశారు. జట్టులో విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలకు స్థానం దక్కింది.  ఇలావుండగా,  ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను శ్రీలంక జారవిడుచుకున్న నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని మహేలా జయవర్ధనే నిర్ణయించుకున్నారు. నాలుగు ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన మహేలా జయవర్ధనే తన దేశానికి కప్ అందించడంలో మాత్రం విఫలమయ్యారు. తాను సెలెక్టర్లతో మాట్లాడుతానని, శ్రీలంక ట్వంటీ20 జట్టు కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్మయించుకున్నానని ఆయన వెస్టిండీస్‌పై ఓటమి తర్వాత చెప్పారు. జయవర్దనే వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. జయవర్ధనే  కొద్దిసేపు క్రీజులో నిలబడి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేది.

అక్కినేని అమల అరెస్టు

ముంబై, అక్టోబర్ 8:  చారిత్రక కట్టడం చార్మినార్ పై పర్యావరణ పరిరక్షణ బ్యానర్లు కట్టినందుకు అక్కినేని అమలను పోలీసులు అరెస్టు చేశారు.   చార్మినార్ వద్ద అనుమతి లేకుండా ఏ విధమైన బ్యానర్లు కట్టకూడదని, అయితే  అమల గ్రీన్‌పీస్ సభ్యులతో కలిసి ఈ  రూల్ ను అతిక్రమించినందున అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.కాగా, అంతర్జాతీయ జీవ వైవిథ్య సదస్సు సందర్బంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి తాము ఈ ప్రదర్సన నిర్వహించినట్లు అక్కినేని అమల చెప్పారు.  కేంద్రం   13 కోల్ బ్లాక్‌లకు అనుమతి ఇచ్చారని, బొగ్గు తవ్వకాలు గిరిజనులను, జంతువులను నిరాశ్రయులను చేస్తున్నాయని, జంతువుల మనుగడ బొగ్గు తవ్వకాల వల్ల దెబ్బ తింటోందని అమల  మీడియాతో అన్నారు.   

ఆశా భోంస్లే కూతురు ఆత్మహత్య

Image
ముంబై, అక్టోబర్ 8:   ప్రముఖ గాయని ఆశా భోంస్లే కూతురు వర్షా భోంస్లే సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వర్షా భోంస్లే వయస్సు యాభయ్యేళ్లు. ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. పలు ప్రముఖ దిన పత్రికలకు కాలమిస్టుగా పని చేశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాకుండా తల్లితో కలిసి పలు సంగీత కార్యక్రమాలలో వర్షా పాల్గొన్నారు. హిందీ, మరాఠీ చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్‌గా పని చేశారు. వర్షా భోంస్లే ఆశా భోంస్లే రెండవ కూతురు. ఆరోగ్య సమస్యలతో ఆమె  ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. వర్షా నాలుగేళ్ల క్రితం 2008 లో కూడా ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం  చేశారు.

శ్రీలక్ష్మికి బెయిల్

హైదరాబాద్, అక్టోబర్ 8:  ఓఎంసి కేసులో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి బెయిల్ మంజూరైంది. గతంలో ఆమె పలుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు. చివరికి సోమవారం నాడు  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. 

సుప్రీంకోర్టులో జగన్ కు దొరకని బెయిల్...

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు  తిరస్కరించింది. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ,  దర్యాఫ్తు కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు తెలిపారు. ఆయన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని, కాబట్టి సాక్ష్యులను బెదిరింపులకు గురి చేసే అవకాశముందన్నారు. బెయిల్ ఇస్తే కేసు ప్రభావితమవుతుందన్నారు. తాము నాలుగు ఛార్జీషీట్లలో మూడువేల అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు. జగన్ విచారణకు సహకరిస్తే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించి, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

అమెరికాలో ఆంధ్రవిద్యార్థి దుర్మరణం

టెక్సాస్‌,అక్టోబర్ 5:  అమెరికాలోఆంధ్ర ప్రదేశ్ కు  చెందిన ఓ తెలుగు విద్యార్థి  రోడ్డు ప్రమాదంలోదుర్మరణం చెందాడు. గౌతం అనే ఈ విద్యార్థి టెక్సాక్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్నాడు.  గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తెనాలికి చెందిన గౌతం కొన్ని రోజుల క్రితమే అమెరికా వచ్చాడు.

వెస్టిండీస్ షాక్...అసీస్ షేక్...

కొలంబో,అక్టోబర్ 5:  ప్రపంచకప్ ట్వంటీ 20లో ఆసీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. విండీస్ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆసీస్  131 పరుగులకే  చేతులెత్తేసింది. జాన్ బాలీ 63 పరుగులు మినహా . మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఓటమి పాలైన ఆసీస్ టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. దీంతో విండీస్ తొలిసారి ప్రపంచకప్ ట్వంటీ 20ల్లో ఫైనల్‌కు చేరింది. విండీస్ బౌలర్లలో రామ్‌పాల్‌కు మూడు వికెట్లు లభించగా బద్రీ, పొలార్డ్‌లకు తలో రెండు వికెట్లు , నరైన్, శ్యామ్యూల్స్‌లకు చెరో వికెట్టు లభించింది. విండీస్ ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది.