మళ్ళీ 'పెట్రో' మంట...
హైదరాబాద్,డిసెంబర్ 14: ప్రభుత్వ, ప్రైవేటు రంగ చమురు సంస్థలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. అన్ని చమురు కంపెనీలు లీటరు పెట్రోల్ ధరను రూ. 2.96 పైసల మేర పెంచాయి. తాజాగా పెంచిన పెట్రోల్ రేట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 90 డాలర్లను అధిగమించడంతో చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత జులైలో పెట్రోల్ ధరలపై కేంద్రం నియంత్రణలను ఎత్తివేయడంతో.. పెట్రోల్ ధరల నిర్ణయం చమురు కంపెనీల అధీనంలోకి వచ్చింది. దీంతో చమురు కంపెనీలు తమ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో పెట్రోల్ ధరలు నాలుగు సార్లుగా పెరిగి మొత్తం నాలుగు రూపాయాలకు పైగా పెరిగాయి. ఇదిలా ఉండగా మరోవైపు డీజిల్ ధరను రూ. 2 పెంచే అంశంపై ఈనెల 22న మంత్రుల సాధికార బృందం భేటీ కానుంది.