నిరర్థకంగా ముగిసిన శీతాకాల పార్లమెంట్
న్యూఢిల్లీ,డిసెంబర్ 13: వ్యర్థమైన శీతాకాల సమావేశాలతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవథికంగా వాయిదా పడ్డాయి. 2 జి. స్పెక్ట్రం కుంభకోణం పై సం యుక్త పార్లమెంటరీ కమిటీ ని నియమించాలని విపక్షాలు 23 రోజులపాటు స్తంభింప చేయడంతో ఈ సమావేశాలు నిరర్థకమే అయ్యాయి. వాయిదాల మీద వాయిదాలతో సాగుతున్న సమావేశాలు సోమవారం కూడా అదే రీతిలో నిరవధికంగా వాయిదాపడ్డాయి. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు కోసం ప్రతిపక్షాల డిమాండ్, దానికి ప్రభుత్వ నిరాకరణ నేపథ్యంగా.. సమావేశం తొలి రోజున మొదలైన ప్రతిష్టంభన చివరి వరకూ కొనసాగింది. దీంతో ఎలాంటి ముఖ్యమైన చర్చలు, కార్యక్రమాలు జరగకుండా శీతాకాల సమావేశాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. భారత పార్లమెంటు చరిత్రలో ఇలా జరగటం ఇదే తొలిసారి. ఈ సమావేశాల కోసం 146 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్టు అంచనా. 2008లో జరిగిన స్పెక్ట్రమ్ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లిందంటూ కాగ్ ఇచ్చిన నివేదికను నవంబర్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టడం.. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. టెలికాం మంత్రి పదవికి డీఎంకే ఎంపీ ఎ.రాజా రాజీనామా చేసినా విపక్షాలు సంతృప్తి చెందలేదు. మొత్తం కుంభకోణంపై జేపీసీ దర్యాప్తు చేయించాల్సిందేనని భీష్మించాయి.
Comments