అసెంబ్లీలో అదే వరస!

హైదరాబాద్,డిసెంబర్ 13 : అసెంబ్లీ మూడోరోజు కూడా విపక్షాల నిరసనలతో హోరెత్తింది. సోమవారం సభ ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. కేసుల ఎత్తివేతపై హోంమంత్రి చేసిన ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో సభ మూడుసార్లు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవటంతో డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు.హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తన ప్రకటనలో,సంవత్సర కాలంలో మొత్తం 8047మందిపై 1667 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. వారిలో 2436 మందిపై పెట్టిన 562 కేసులను ప్రభుత్వం ఎత్తివేసినట్లు తెలిపారు.నేరాల స్వభావాన్ని బట్టి కేసులను రెండు విభాగాలుగా విభజించినట్లు ఆమె పేర్కొన్నారు. సాధారణ కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయించినట్లు హోంమంత్రి చెప్పరు. రెండో విభాగంలో తీవ్రమైన కేసులు ఉన్నాయని, . 2500మందిపై 383 కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయని వివరించారు. 411మందిపై 112 కేసులను దర్యాప్తు సమయంలోనే ఉపసంహరించటం జరిగిందన్నారు. తీవ్రతను బట్టే కేసులు ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సబితా తెలిపారు. హోంమంత్రి ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. సాధారణ కేసులను మాత్రమే ఎత్తివేస్తున్నట్లు చేసిన ప్రకటనపై దుమారం రేగింది. విద్యార్థులపై పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలని పీఆర్పీ, బీజేపీ, సీసీఎం, సీపీఐ, ఎంఐఎం డిమాండ్ చెశాయి. కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి విద్యార్థులపై పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వారిపై ఉన్న సాధారణ కేసులను ఎత్తివేయటం జరిగిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సభకు తెలిపారు. కేసులన్ని ఒకేసారి ఎత్తివేయటం సాధ్యం కాదని, తీవ్రమైన కేసుల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. కేసుల ఎత్తివేత విద్యార్థుల భవిష్యత్, శాంతిభద్రతలో ముడిపడిన అంశమన్నారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి కేసులు ఎత్తివేశామన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రావని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్‌లో హింసకు పాల్పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు