చంద్రబాబు అరెస్ట్...
హైదరాబాద్ ,డిసెంబర్ 13 : రైతు సమస్యలపై శాసనసభ ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ను సోమవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. రైతుల అఖిలపక్ష నేతలను శాసనసభలోపలికి అనుమతించకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పార్టీ నేతలతో సహా రోడ్డుపై బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపు మూడు గంటల పాటు ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అరెస్టు చేసిన రైతు పక్ష నేతలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుతో సెంట్రల్ జోన్ డిసిపి మాట్లాడారు. అయినా చంద్రబాబు వినలేదు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.చంద్రబాబును అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీసులను అడ్డుకోవడానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్టు చేసిన చంద్రబాబును, తెలుగుదేశం నాయకులను హైదరాబాదులోని గోషామహల్ పోలీసు స్టేడియానికి తరలించారు. చంద్రబాబుతో పాటు 70 మంది శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అక్కడే నిరసన తెలియజేస్తున్నారు. మంగళవారం ఉదయం వరకు అక్కడే ఉండి నేరుగా శాసనసభకు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. ఒక వేళ తమను కోర్టుకు తీసుకుని వెళ్తామంటే దానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం నాయకుడు దాడి వీరభద్ర రావు చెప్పారు.

Comments