ఆరు పదులు నిండిన రజనీ

చెన్నై,డిసెంబర్ 12: దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆదివారం 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది తాను నటించిన ‘రోబో’ యావత్ దేశాన్ని ఉర్రూతలూగించినా రజనీ మాత్రం తన పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకున్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తమిళనాడు వ్యాప్తంగా రజనీ జన్మదినాన్ని కోలాహలంగా జరుపుకున్నారు. ఆలయాల్లో రజనీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం, దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను చేపట్టారు. చెన్నైలో అభిమానులు వాడవాడలా రజనీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి మిఠాయిలు పంచి పెట్టారు.బాణసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. పుట్టినరోజున రజనీ చెన్నైలో లేరనే వార్త వారిని నిరాశకు గురిచేసింది. కాగా, రజనీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ఉదయాన్నే రజనీకాంత్‌కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రజనీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒడిస్సీ అనే సంస్థ ‘రజనీ పంచతంత్ర’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ఆవిష్కరించగా, నటి రాధిక దాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రజనీ పెద్దకుమార్తె ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.కాగా, హైదరాబాద్‌లో ఉన్న రజనీకాంత్ తన ప్రియమిత్రుడు, నటుడు మోహన్‌బాబు ఇంటికి ఉదయాన్నే వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం మాదాపూర్‌లోని మోహన్‌బాబు కార్యాలయానికి వెళ్లి అక్కడ కొద్దిసేపు గడిపారు. మధ్యాహ్నం తిరిగి మోహన్‌బాబు ఇంటికి వచ్చి భోజనం చేశారు. సాయంత్రం 5.20గంటలకు చెన్నై తిరిగి వెళ్లినట్లు తెలిసింది.

Comments