నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం : రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ లకు పదవులు
హైదరాబాద్, అక్టోబర్ 22: ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. తొలి విడతగా ఇద్దరు మాజీ మంత్రులకు పదవులు దక్కాయి. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేదురుమల్లి రాజ్యలక్ష్మి, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్ నియమితులయ్యారు. రాజ్యలక్ష్మి, మండలి బుద్ధ ప్రసాద్ 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరిలో రాజ్యలక్ష్మి నెల్లూరు జిల్లాకు చెందినవారు కాగా, మండలి బుద్ధప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందినవారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచినప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగలేదు. 2004 ఎన్నికలలో కాంగ్రెసు విజయంతో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది మందిని మాత్రమే నామినేటెడ్ పోస్టులు వరించాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రోశయ్య కూడా నామమాత్రంగానే పోస్టులను భర్తీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కాలం నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రయత్నాలు సాగించారు. నామినెటెడ్ పోస్టుల భర్తీని విడతలవారీగా చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్నందున సాధ్యమైనంత ఎక్కువ మందికి పదవులు కట్టబెట్టాలని సి.ఎం. భావిస్తున్నారట.
Comments