Monday, October 1, 2012

మెగా జీవ వైవిధ్య కేంద్రంగా భారత్ : జయంతీ నటరాజన్

 హైదరాబాద్ లో జీవ వైవిద్య సదస్సు ప్రారంభం... 
హైదరాబాద్,అక్టోబర్ 1:   హైదరాబాద్ లో 19 రోజులపాటు జరిగే 11వ జీవ వైవిద్య సదస్సును కేంద్ర పర్యావరణ శాఖమంత్రి జయంతీ నటరాజన్ సోమవారం ప్రారంభించారు. భారతదేశం మెగా జీవ వైవిధ్య కేంద్రంగా అవతరిస్తోందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అన్నారు.  ఆధునికీకరణ, వాతావరణ మార్పుల వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. జీవ వైవిధ్యంపై హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సదస్సుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. మానవ ఆరోగ్య మెరుగుదల కోసం జీవ సమతౌల్యం అవసరమని తెలిపారు. జీవ వైవిధ్యాన్ని కాపాడే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను ఎలా ఎదుర్కొవాలనే అంశాన్ని సదస్సులో చర్చిస్తారని, భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయాలు తీసుకుంటారని జయంతీ నటరాజన్ పేర్కొన్నారు. జీవ వైవిధ్యంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని, ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నాయని, అవి మరింత విస్తృతం కావాలని ఆమె ఆకాంక్షించారు. సవాళ్లను ఎదుర్కొని జీవ వైవిధ్యాన్ని భావి తరాలకు అందించాల్సిన ప్రాముఖ్యతను జయంతీ నటరాజన్ నొక్కిచెప్పారు.ఈ సదస్సులో 190 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు.  జీవ వైవిధ్యంపై  ఇప్పటివరకు పది సదస్సులు జరగగా ప్రస్తుతం పదకొండో సదస్సు జరుగుతోంది. రెండేళ్ల కిందట ఈ జీవ వైవిధ్య సదస్సుకు జపాన్ లోని నగోయ నగరం ఆతిథ్యం ఇచ్చింది. గవర్నర్ నరసిం హన్ మాట్లాడుతూ, మానవ చరిత్రలో పర్యావరణానికి చాలా ప్రాముఖ్యత ఉందని,  అనారోగ్యాలు, ఆకలి సమస్యలను అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. భూగర్భ జల వనరులు అడుగంటిపోవడం, సాగు భూములు తగ్గుదలపై సదస్సులో చర్చించి  సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...