Monday, July 9, 2012

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై తెలుగుదేశం సస్పెన్షన్ వేటు..

ఇక జగన్ పార్టీలో చేరడమే తరవాయి...  
హైదరాబాద్ ,జులై 9:  కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ  సస్పెండ్‌ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. నాని సోమవారం  ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో భేటీ అయ్యారు. ఈ విషయం తెలిసిన టీడీపీ వెంటనే నానిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ అనుచరుడిగా నానికి పేరు. గుడివాడ నుంచి ఆయన రెండుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. నిర్మాతగా జూనియర్‌ ఎన్టీఆర్‌తో కొన్ని సినిమాలు కూడా తీశారు. గత కొంతకాలంగా నాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కృష్ణా జిల్లాలో పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాల్లోనూ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన కినుక వహించారు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని అవమానిస్తున్నారని  నాని ఏడాది క్రితమే చంద్రబాబును నిలదీశారు. అప్పుడు ఆయనకు షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేశారు. కాగా, కొడాలి నాని విలేకర్లతో మాట్లాడుతూ తనపై టీడీపీ చేసిన విమర్శలకు త్వరలోనే సమాధానం చెబుతానన్నారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు.ఆయన సోమవారం  చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. 
నాని వెనుక నేను లేను: ఎన్టీఆర్
యే కొడాలి నాని పార్టీ మారడం వెనుక తన ప్రోద్భలం లేదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తన కుటుంబానికి  తెలుగుదేశం పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. తన ప్రాణమున్నంత వరకు... పార్టీ ఉన్నంత వరకు..., తెలుగు జాతి ఉన్నంత వరకు.. తాను తెలుగుదేశంతోనే ఉంటానని ఆయన అన్నారు. తన వృత్తి సినిమా అని.. వృత్తి కారణంగానే టీడీపీకి దూరంగా ఉన్నానని ఆయన అన్నారు. తాను ఎన్టీఆర్‌ను ఎప్పుడూ మర్చిపోలేనని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ్టి జనరేషన్‌కు ఎన్ టీ ఆర్ గురించి తెలపడం తన మీదున్న ప్రధాన బాధ్యత అని అన్నారు. టీడీపీ నుంచి వీడిపోయాననడం కరెక్టు కాదన్నారు. 
గుడివాడపై బాలయ్య కన్ను?
 జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడై కొడాలి నాని ప్రాతినిధ్యం వహిఉన్న   గుడివాడ శాసనసభా స్థానంపై హీరో బాలకృష్న కన్నేసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి ఆయన శాసనసభకు పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పుట్టిన గడ్డ కావడంతో ఆయన ఆ స్థానానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి తొలి మెట్టుగా దాన్ని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...